29-03-2025 11:24:42 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): జంతువుల పట్ల దయ చూపినందుకు అల్లా మనకు కూడా ప్రతిఫలం ఇస్తాడని భావించి దానిని ఆచరణాత్మకంగా చేసి చూపించిన ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో సేవాభావానికి స్పూర్తికి నిదర్శనం నిలిచారు. చుంచుపల్లి మండలం, రుద్రంపూర్ కు చెందిన ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలో అన్న పానీయాలు లేకుండా ఉండటం ఎంత కష్టమో, మన పరిస్థితి ఈ విధంగా ఉంటే పశుపక్షాల పరిస్థితి ఎంటని ముస్లిం యువకులు ఆలోచించారు. మండుతున్న ఎండలు, భూగర్భజలాలలు అడుగంటడంతో వేసవి తాపాన్ని తట్టుకోవడం మానవులకే కష్టతరంగా మారిన సమయంలో పశుపక్షుల పరిస్థితి ఏమిటని ఆలోచించారు.
వృధా అవుతున్న నీటిని వినియోగంలోకి తేవడమే కాకుండా పశుపక్షులకు ఉపయోగకరంగా మార్చేందుకు, రుద్రంపూర్ ఈద్గా వద్ద ఉన్న చేతి పంపు నుండి వచ్చే నీటిని తమ అవసరాలకు వాడుకోగా వృధాగా పోతున్న నీటిని నిల్వచేసేందుకు సిమెంట్ తొట్టిని అమర్చారు. దీంతో నిల్వ ఉన్న నీటిని పశుపక్షాదులు తాగేందుకు ఉపయోగపడనుంది. ప్రాణదారణమైన నీటిని వృధా కాకుండా వినియోగంలోకి తెచ్చి పశుపక్షాదుల దాహార్తిని తీర్చి మండుటెండల్లో ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు వీరు చేసిన కృషిని స్థానికులు అభినందనలతో పాటు, మనస్సాక్షికి సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు, పవిత్ర రంజాన్ మాసంలో అవతరించిన ఖురాన్ చూపిన బాటలో పవిత్రమైన మనసుతో ఆలోచిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఖురాన్ లో ఎన్నో తెలుపబడ్డాయని రంజాన్ మాస పవిత్రతను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ షబ్బీర్, మహబూబ్ పాషా, షేక్ సోనీ సాహెబ్, హుస్సేన్ తదితరులు ఉన్నారు.