calender_icon.png 30 March, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితం

27-03-2025 01:23:07 AM

  1. బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా దాడులు
  2. రాహుల్ వంటి వ్యక్తుల వల్ల బీజేపీకే మేలు
  3. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 

లక్నో, మార్చి 26: హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితంగా ఉంటారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. బుధవారం ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.. వంద హిందూ కుటుంబాల మధ్య ఒక ముస్లిం కుటుంబం సురక్షితంగా ఉంటుందని, అయితే 100 ముస్లిం కుటుంబాల మధ్య 50మంది హిందువులు సురక్షితంగా ఉండలేరని చెప్పారు.

దీనికి బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చని గత ఘటనలు గుర్తుచేశారు. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైనప్పటి నుంచి హిందువులే లక్ష్యంగా దాడులు జరిగాయని, పూజారులను అరెస్ట్ చేశారని, అక్కడి మైనారిటీల ఇళ్లను దోచుకు న్నారని, 150కి పైగా ఆలయాలను ఇస్లామిక్ రాడికల్స్ ధ్వంసం చేశారని తెలిపారు.

యూపీలో 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మత అల్లర్లు ఆగిపోయాయని, ఒక యోగిగా తాను ‘అందరి ఆనందాన్ని’ కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అనేక రాష్ట్రాల్లో ఆలయ వివాదాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో యోగి స్పందిస్తూ..

హిందూ స్థలాలలో మసీదుల నిర్మాణమే దీనికి కారణమన్నారు. ఇది ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. షాహి జామా మసీదులో కోర్టు ఆదేశించిన సర్వే సందర్భంగా భారీ హింస జరిగిన సంభాల్‌లో ఉన్న దేవాలయాలను తమ ప్రభుత్వం పునరు ద్ధరిస్తుందని తెలిపారు.

రాహుల్‌తో బీజేపీకి మేలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వల్ల బీజేపీకి మేలు చేకూరుతోందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. విభజన రాజకీయాల్లో భాగంగా రాహుల్ జోడో యాత్ర చేపట్టారని, భారత్ వెలుపల స్వదేశాన్ని ఆయన విమర్శిస్తుంటారన్నారు. రాహుల్ ఉద్దేశం, స్వభావం దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని..రాహుల్ వంటి వ్యక్తుల వల్ల బీజేపీకే మేలు జరుగుతుందని సెటైర్ వేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసం సున్నితమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ పొడిగించిందని విమర్శించారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయలేదని, కుంభమేళాకు ప్రచారం చేయలేదని, దేశంలో ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు.

యోగి విమానంలో సాంకేతిక సమస్య

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న విమానం లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే వెనక్కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఆగ్రాలో పర్యటిస్తున్న యోగి ప్రయాణిస్తున్న చార్టెడ్ విమానం టేకాఫ్ అయిన తర్వాత 20 నిమిషాలకు పైలెట్స్ సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో వెంటనే వెనక్క మళ్లించి ఆగ్రాలోని ఖేడియా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. సీఎం యోగి కోసం ఢిల్లీ నుంచి మరో విమానాన్ని రప్పించగా.. ఆయన అంతవరకు ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే వేచి ఉన్నట్లు సమాచారం.