వాషింగ్టన్, సెప్టెంబర్ 19 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ మద్దతు ప్రకటించారు. అయితే ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు మాత్రం డెమాక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే తమ విరాళాలను కూడా ట్రంప్‌ను కాదని కమలకు ఇస్తున్నట్లు తెలిసింది. కానీ మస్క్ మాత్రం ట్రంప్‌నకు భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తాను అధికారంలోకి వస్తే ఎలాన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటానని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
యూఎస్‌లోని ఓ సంస్థ వెల్లడించిన ప్రకారం టెస్లా ఉద్యోగులు కమలకు 42,824 డాలర్ల విరాళం ఇవ్వగా, ట్రంప్‌నకు మాత్రం 24,840 డాలర్ల విరాళం అందించారు. కాగా మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఉద్యోగులు కూడా కమలకే మద్దతు ఇస్తున్నారు. వీరు కమలకు 34,526 డాలర్ల విరాళం ఇవ్వగా, ట్రంప్‌నకు కేవలం 7,652 డాలర్ల విరాళం అందజేశారు. ఎలాన్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విట్టర్) ఉద్యోగులు సైతం కమలా హారిస్‌కు 13, 213 డాలర్లు విరాళం అందించారు. ట్రంప్‌నకు 500 డాలర్ల కంటే తక్కువ విరాళం అందజేశారు. మస్క్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది డెమాక్రటిక్‌కు బలం ఉన్న కాలిఫోర్నియాలో ఉండడమే దీనికి కారణమని టెస్లా వాటాదారు, గెర్బర్ కవాసకి వెల్త్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సీఈవో రాస్ పేర్కొన్నారు.