calender_icon.png 2 October, 2024 | 3:26 PM

పుట్టగొడుగుల్లా క్లినిక్‌లు!

02-10-2024 12:18:57 AM

  1. విచ్చలవిడిగా ఆర్‌ఎంపీ ఆసుపత్రులు
  2. వైద్యం తెలియకున్నా చికిత్స
  3. అటాచ్డ్‌గా మెడికల్ దుకాణాలు

మంచిర్యాల, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని కొంత మంది ఆర్‌ఎంపీ, పీఎంపీల కక్కుర్తి అమాయకుల ప్రాణాలమీదకు తెస్తోంది. కేవలం ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్‌ఎంపీ, పీఎంపీలు వారే వైద్య నిపుణుల్లా చెలామణి అవుతూ అందినకాడికి దోచుకుంటున్నారు.

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీలుగా పని చేసిన వారు ప్రస్తుతం ఆసుపత్రుల యజమానులుగా చెలామణి అవుతున్నారు. కొందరేమో ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులకు కమీషన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. 

ఆర్‌ఎంపీ, పీఎంపీలు వెయ్యి మంది

గతంలో జిల్లాలో మండలానికి ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఉండేవారు. ప్రస్తుతం జిల్లాలో వారి సంఖ్య వెయ్యికి చేరుకుంది. కరోనా తర్వాత  ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా క్లినిక్‌లు వెలుస్తున్నాయి. ఒకటి, రెండు సంవత్సరాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేసిన అనుభవంతో సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసు కుంటున్నారు. కనీస అర్హత లేకున్నా వైద్యుల వద్ద మెడికల్ షాపులలో పని చేసిన అనుభవంతో తెలిసీ తెలియని వైద్యం అందిస్తున్నారు. 

మందులు సరఫరా చేస్తున్న ఏజెన్సీలు

ఏజెన్సీలు నిబంధనల ప్రకారం మెడికల్ షాపులకే మందులు విక్రయించాలి. కానీ కొన్ని ఏజెన్సీలు ఆర్‌ఎంపీలకు, పీఎంపీలకు స్లున్‌లు, ఇంజక్షన్లు, మందులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారు. ఎలాంటి రశీదులు లేకుండా ఏజెన్సీలు నేరుగా మం దులు విక్రయిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వీరికి మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే దానిపై అధికారులు దృష్టి సారించడం లేదు.

యథేచ్ఛగా బెడ్ల ఏర్పాటు

ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కేవలం వీరు ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ వీరు ఏకంగా క్లినిక్‌లు తెరిచి ఆసుపత్రుల మాదిరి బెడ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎటువంటి రోగంతో వచ్చినా నయం చేస్తామని నమ్మబలికి తమకు తోచిన చికిత్స అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

కొందరైతే యూట్యూబ్‌లో చూసి వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రాణాల మీదకు వస్తే వెంటనే వారికి తెలిసిన ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు. 

ఆర్‌ఎంపీలకు అటాచ్డ్‌గా మెడికల్ షాపులు

ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు అటాచ్డ్‌గా మెడికల్ దుకాణాలు నడుపుతున్నారు. ఒక్కో ఆర్‌ఎంపీ, పీఎంపీకి అనుబంధం గా మెడికల్ షాపులు పెడుతూ ఆర్‌ఎంపీలు, పీఎంపీలు రాసిన మందులను విక్రయిస్తున్నారు. అసలు మందులు రాసే అర్హత వీరికి ఉండదు. కానీ ఎక్కడ చూసినా వారు రాసిందే నడుస్తోంది.

మందుల దుకాణాల నిర్వాహకులే ఆర్‌ఎంపీ, పీఎంపీల భవనానికి అద్దె చెల్లి స్తారు. అందుకు అనుగుణంగా మెడికల్ షాపులో మందులు రాయాల్సి ఉంటుంది. రోగం ఏదైనా వందల్లో మందులు రాసుడే. లేకుంటే ఆ ఆర్‌ఎంపీని, పీఎంపీని మార్చుడే. ఇదీ జిల్లాలో కొనసాగుతున్న తతంగం. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.