- సెంచరీతో మెరిసిన ముషీర్ ఖాన్
- నిరాశపర్చిన యశస్వి, పంత్, నితీశ్ రెడ్డి, రుతురాజ్, శ్రేయస్, పడిక్కల్
- అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న అక్షర్
- బరిలోకి దిగని సూర్య, ఇషాన్
విజయక్రాంతి, ఖేల్ విభాగం: ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఆరంభమైంది. ఐదుగురు మినహా భారత స్టార్లంతా ఈ ట్రోఫీ ఆడుతుండడంతో అందరి దృష్టి దీని మీదకి మళ్లింది. అంతే కాకుండా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరుకునేందుకు కీలకమైన బంగ్లా టెస్టు సిరీస్‌కు ఈ ట్రోఫీ ఆటతీరునే ప్రామాణికంగా తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించడంతో ఈ ట్రోఫీ మరింత హైప్ వచ్చింది. ఏ, బీ, సీ, డీ జట్లుగా స్టార్లంతా తలపడే ఈ ట్రోఫీ గురువారం ఆరంభమైంది. తొలి రౌండ్ మ్యాచ్‌లకు బెంగళూరుతో పాటు అనంతపురం ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సీ x డీ మ్యాచ్ అనంతపురంలో, ఏ x బీ మ్యాచ్ బెంగళూరులో జరుగుతున్నాయి.
టాస్ గెలిచిన ఏ, సీ
ఇండియా ఏ x ఇండియా బీ మ్యాచ్ బెంగళూరు వేదికగా ఆరంభం అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ఏ కెప్టెన్ గిల్ ఇండియా బీ జట్టుని మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అనంతపురంలో జరుగుతున్న ఇండియా సీ x ఇండియా డీ మ్యాచ్‌లో సీ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఇండియా డీ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
నిరాశపర్చిన యువ ఓపెనర్
ఇండియా బీ తరఫున ఆడుతున్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30) పెద్దగా రాణించలేదు. అంతే కాక బీ జట్టు కెప్టెన్ ఈశ్వరన్ (13), సర్ఫరాజ్ ఖాన్ (9), పంత్ (7), నితీశ్ రెడ్డి (0), సుందర్ (0) నిరాశపర్చారు. ఇండియా బీ జట్టు 100 లోపే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వన్ డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ (105*) సెంచరీతో కదం తొక్కి జట్టును ఆదుకున్నాడు. అతడికి టెయిలెండర్ నవదీప్ సైని (29*) సహకారం అందించాడు. వీరిద్దరూ ఇండియా బీ జట్టు స్కోరు బోర్డును 100, 150, 200 పరుగుల మార్కు దాటించారు. వీరిద్దరి పోరాటంతో ఇండియా బీ జట్టు మొదటి రోజు ముగిసేసరికి 202 పరుగుల గౌరవప్రద స్కోరు చేసింది. ఇండియా ఏ బౌలర్లలో ఖలీల్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
200ల్లోపే..
ఇక టాస్ ఓడి మొదటి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా డీ జట్టు 200 పరుగులు కూడా చేయకుండానే చాపచుట్టేసింది. ఓపెనర్లుగా వచ్చిన అథర్వ టైడే (4), యశ్ దూబే (10) దారుణంగా విఫలమయ్యారు. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9) అయినా ఆదుకుంటాడనుకుంటే అయ్యర్ పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన పడిక్కల్ (0), భుయ్ (4), కీపర్ శ్రీకర్ భరత్ (13) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఆదుకున్న అక్షర్
ఒకానొక దశలో ఇండియా డీ జట్టు 76 పరుగులకే 8 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (86) ఇండియా డీని ఆదుకున్నాడు. అర్ధ సెంచరీతో అడ్డుగోడలా నిలిచాడు. అక్షర్ గనుక లేకుంటే ఇండియా డీ జట్టు 150 పరుగులు కూడా చేసేది కాదు. అక్షర్‌కు సరన్ష్ జైన్ (13), అర్షదీప్ సింగ్ (13) సహకరించారు. ఇక ఇండియా సీ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 3, కంబోజ్, చౌహాన్ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ ఆరంభించిన ఇండియా సీ జట్టు రోజు ముగిసే సరికి 33 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. హర్షిత్, అక్షర్ పటేల్ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు.
బాల్‌తో కూడా..
జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో అర్ధ సెంచరీతో తన విలువను చాటి చెప్పిన ఇండియా డీ జట్టు ఆల్‌రౌండ్ అక్షర్ పటేల్ బంతితో కూడా మాయ చేశాడు. ఆరు ఓవర్లు వేసిన అక్షర్ ఓ మెయిడెన్ ఓవర్ వేసి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
సూర్య, కిషన్ దూరం..
దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్ మ్యాచ్‌కు భారత స్టార్ ప్లేయర్, మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ దూరమయ్యాడు. ఇండియా సీ జట్టులో భాగంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు బుచ్చిబాబు టోర్నీలో గాయం అయింది. దీంతో అతడు మొదటి రౌండ్ మ్యాచెస్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం సూర్య బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. రెండో రౌండ్ మ్యాచెస్‌కు అందుబాటులో ఉంటా డా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇక ఎన్నో రోజుల నుంచి జాతీయ జట్టులో చోటు కోసం చూస్తున్న యువ వికెట్ కీపర్ కిషన్ కూడా గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచెస్‌కు దూరం అయ్యాడు.
అసలెవరీ ముషీర్ ఖాన్..
పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇండియా బీ జట్టును 19 సంవత్సరాల ముషీర్ ఖాన్ తన అజేయ సెంచరీతో ఆదుకున్నాడు. దాంతో అసలు ఈ ముషీర్ ఖాన్ ఎవరా? అని అంతా వెతుకుతున్నారు. ముషీర్ ఖాన్ మరెవరో కాదు.. యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే. 2005లో ముంబైలోని కుర్లాలో జన్మించిన ముషీర్ ముంబై రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆల్‌రౌండర్ అయిన ముషీర్ ఖాన్ ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ కూడా కావడం గమనార్హం. యువ ఇండియా రన్నరప్‌గా నిలిచిన 2024 అండర్ వరల్డ్‌కప్‌లో కూడా ముషీర్ సభ్యుడే. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ కెరీర్లో డబుల్ సెంచరీ బాదిన ముషీర్ ఇప్పుడు ఈ ఇన్నింగ్స్‌తో దేశం మొత్తం తన వైపుకు చూసేలా చేసుకున్నాడు.