జగిత్యాల అర్బన్, డిసెంబర్ 31: ఓ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 5వేలు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మంగళవారం తీర్పు విలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేకల్ల గ్రామానికి చెందిన మైదం శంకరయ్య అదే గ్రామానికి చెందిన ఒడ్నాల పోచమల్లు కు మద్యం సేవిస్తున్న ప్రదేశంలో గొడవ జరిగింది.
ఈ గొడవను మనసులో పెట్టుకొని శంకరయ్యను చంపాలనే ఉద్దేశంతో పోచమల్లు తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడవగా తీవ్ర గాయాలైన శంకరయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతుని అల్లుడి ఫిర్యాదు మేరకు బుగ్గారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు ఒడ్నాల పోచమల్లును కోర్టులో హాజరు పరచడం జరిగిందన్నారు.
కేసును విచారించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ నిందితునికి జీవిత ఖైదు తో పాటు రు.5000లు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. ఈ కేస్‌లో పీపీగా మల్లికార్జున్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా ఇన్స్పెక్టర్ లు నాగేందర్,లక్ష్మీబాబు, ఎస్.ఐ రవీం దర్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్, లైజనింగ్ కానిస్టేబుల్ కిరణ్ నిందితునికి శిక్ష పడడం లో కోర్టుకు సాక్షాధారాలు అందించడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగిందన్నారు. నిందితునికి శిక్ష పడటం లో కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.