calender_icon.png 18 March, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవమాన భారంతో మిత్రుడి హత్య..

17-03-2025 08:06:39 PM

ముగ్గురు నిందితుల రిమాండ్..

పాపన్నపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తులకు కోర్టు జరిమానా విధించింది. ఆ జరిమానా తమకు అవమాన భారంగా భావించి, జరిమానా పడడానికి ఒక వ్యక్తిని కారణగా భావించి అతడికి బాగా మద్యం తాగించి ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేసిన కేసును పోలీసులు విజయవంతంగా చెదించారు. ఈ కేసుకి సంబందించిన వివరాలను మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి పాపన్నపేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి విలేకరులకు వెల్లడించారు. మార్చి 08 నాడు ఏడుపాయల ప్రాంతంలో సంగారెడ్డికి చెందిన గౌరెల్లి వినోద్ రెడ్డిని ముగ్గురు నిందితులు పథకం ప్రకారం హత్య చేశారన్నారు. హత్య జరిగిన 20 రోజుల ముందు నిందితులు మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డారు.

కోర్టులో జరిమానా చెల్లించి వాహనాలను విడుదల చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడ్డప్పుడు మృతుడు వినోద్ రెడ్డి దురుసు ప్రవర్తన కారణంగానే తమకు జరిమానా పడిందని, ఆ విషయం అవమానంగా భావించారు. వినోద్ రెడ్డి కారణంగానే తమ పరువు పోయిందని భావించిన నిందితులు అతనిపై పగ పెంచుకొని ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగానే ముందస్తుగా పథకం వేసుకొని ఏడుపాయల ప్రాంతంలో మద్యం సేవించిన అనంతరం వినోద్ రెడ్డి మత్తులో ఉండగా నిందితులు నవీన్ తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. అనంతరం బేగరి రాములు కట్టెతో నుదుటిపై కొట్టాడు. రమణాచారి ఛాతిపై కాలితో తన్నాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వినోద్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

హత్యకు ఉపయోగించిన కర్రను నిందితులు నీటిలో పారేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న వడ్ల నవీన్ కుమార్ (24) పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, ఏ2 గా ఉన్న కమ్మరి రమణ చారి (32) సంగారెడ్డి పట్టణంలోని మారుతినగర్, ఏ3 గా ఉన్న బేగరి రాములు (40) సంగారెడ్డి శ్రీ నగర్ కాలనీకి చెందిన వారీగా సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచి రిమాండ్ కి తరలించారు. నిందితులు, భాదితుడికి చెందిన సెల్ ఫోన్స్, 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టు వెల్లడించారు. కేసును విజయవంతంగా చేధించిన మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు.