calender_icon.png 22 December, 2024 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదేళ్ల బాలికపై హత్యాచారం

13-09-2024 12:00:00 AM

దోషికి మరణశిక్ష విధించిన సంగారెడ్డి జిల్లా కోర్టు

సంగారెడ్డి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. నేరం తీవ్రమైనదిగా పరిగణించి దోషికి మరణశిక్షను ఖరారు చేసింది. కోర్టు తీర్పుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తన కార్యాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో వెల్లడించారు. బీడీఎల్ భానూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చింతు శ్రీనివాస్‌రావు అనే వ్యక్తి నిర్వహించే ఆదిత్య కన్‌స్ట్రక్షన్ కంపెనీలో శంకర్, ఉమాదేవి దంపతులు పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్ వారిని 2023 అక్టోబర్ 16న స్థానికంగా ఉన్న చైతన్య కంపెనీలో పనికోసం పంపించాడు.

దీంతో వారు తమ ఐదేళ్ల మనవ రాలిని చైతన్య కంపెనీ సెక్యూరిటీ గార్డు వద్ద ఉంచి పనికి వెళ్లారు. బీహార్ రాష్ట్రానికి చెందిన గఫాఫర్ (56) ఉపాధి నిమిత్తం వచ్చి అదే కంపెనీలోని లేబర్ రూమ్‌లో ఉంటున్నాడు. ఆ రోజు పనికి వెళ్లకుండా గదిలోనే ఉన్న గఫాఫర్ పూటుగా మద్యం తాగాడు. సెక్యూరిటీ గార్డు వద్ద బాలిక కనిపించడంతో. ఆమె తనకు తెలుసని, కూల్‌డ్రింక్ తాగించుకొస్తానని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లాడు.

ఈ క్రమంలోనే బాలికతో మద్యం కలిపిన కూల్‌డ్రింక్ తాగించి సమీపంలోని పత్తి చేనులోకి తీసుకుపోయి అత్యాచారం చేశాడు. అనంతరం ఎవరికైనా చెబుతుందనే భయంతో హత్య చేసి పారిపోయాడు. ఘటనపై బాలిక తాత, అమ్మమ బీడీఎల్ భానూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్‌హెచ్‌వో రవీందర్ రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వపరాలను విన్న న్యాయమూర్తి జయంతి.. మరణశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించారు. బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు.