గొడ్డలితో నరికి, మర్మాంగాలు కోసి హత్య
ఘాతుకానికి పాల్పడిన భార్య, కుమార్తె, బంధువులు
నాగర్కర్నూల్, నవంబర్ 23 (విజయక్రాంతి): నూతన ఇంటి నిర్మాణంతో పాటు తన కూతుళ్ల పెళ్లి ఖర్చుల కోసం ఇంటి యజమాని పొలం అమ్మకానికి పెట్టాడు. దాన్ని వ్యతిరేకించిన భార్య.. తన కూతురితోపాటు అల్లుడు, సోదరులతో కలిసి అత్యంత కిరాతకంగా మర్మాంగాలను కోసి, హతమార్చింది. ఈ దారుణఘటన నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య(56), ఎల్లమ్మ దంపతులు. వారికి 2.14 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ఐదుగురు కూతుళ్లు కాగా ఇద్దరికి పెళ్లి చేశారు.
మరో ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేయాల్సి ఉంది. వారికి పెళ్లి ఖర్చులతో పాటు కొత్త ఇంటి నిర్మాణం కోసం తన పొలాన్ని ఈశ్వరయ్య అమ్మకానికి పెట్టాడు. దీన్ని ఎల్లమ్మ వ్యతిరేకిస్తూ వస్తున్నది. శుక్రవారం రాత్రి రోజూలాగే భోజనం చేసిన అనంతరం నిద్రకు ఉపక్రమించారు. శనివారం మధ్యహ్నమైనా ఇంటి తలుపులు తెరుచుకోకపోవ డంతో స్థానికులు తలుపుతట్టి చూసేసరికే ఈశ్వరయ్య రక్తపుమడుగులో పడి ఉన్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యకు వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. ఈశ్వరయ్య మర్మాంగాలను కోసి హత్య చేసినట్టు గుర్తించారు. ఎల్లమ్మతో పాటు పెద్ద కుమార్తె స్వాతి, అల్లుడు మల్లేశ్, ఎల్లమ్మ సోదరుడు బాలస్వామి, ఎల్లమ్మ సోదరి ఆశమ్మతో కలిసి హతమార్చినట్లు మృతుడి సోదరి నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.