- మృతదేహానికి నిప్పంటించి పరార్..
- తాగిన మైకంలో స్నేహితుల గొడవ
జనగామ, జనవరి 12 (విజయక్రాంతి): మద్యం మత్తులో ఉన్న స్నేహితుల మధ్య రూ.300 కోసం గొడవ జరగడంతో ఒకరిని హత్య చేసి, నిప్పంటించి పరారయ్యారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. మహబూబాబాద్ కు చెందిన వెంకన్న(30) 15 ఏళ్ల క్రితం జనగామకు వలస వచ్చి యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక రైల్వేస్టేషన్ పరిధిలో ఉంటూ కోతులను ఆడిస్తూ, భిక్షాటన చేస్తూ బతుకీడుస్తున్నాడు.
శనివారం రాత్రి జనగామ పట్టణంలోని ధర్మకంచ, సంజయ్ నగర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అర్ధరాత్రి సమయంలో హన్మకొండ రోడ్డులో గల వినాయక బార్ అండ్ రెస్టారెంట్ వెనుకాల నిర్మానుష్య ప్రదేశంలో నలుగురు కలిసి మద్యం సేవించారు.
వెంకన్నను మిగతా స్నేహితులు మద్యం కోసం రూ.300 ఇవ్వాలని అడగడంతో వెంకన్న లేవంటూ నిరాకరించాడు. దీంతో నలుగురి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. ముగ్గురు యువకులు కలిసి వెంకన్నపై దాడి చేసి, బండరాయితో తల పై బాదడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం మృతదేహానికి నిప్పంటించి నిందితులు పరారయ్యారు.
ఒకరు లొంగిపోవడంతో బయటకు?
నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించలేదు. యువకుడి హత్యలో ముగ్గురు ప్రత్యక్షంగా ఉన్నట్లు తెలిసింది. సంజయ్‌నగర్‌కు చెందిన లక్ష్మణ్ అనే యువకుడితో పాటు ధర్మకంచకు చెందిన మరో ఇద్దరు యువకులు హత్యలో పాల్గొన్నట్లు సమాచారం.
అర్ధరాత్రి హత్య అనంతరం లక్ష్మణ్ ఫోన్‌ను ధర్మకంచకు చెందిన యువకులు గుంజుకుని విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరుగు తోంది. ఆదివారం తెల్లవారుజామున లక్ష్మణ్ పోలీసులకు లొంగిపోయి హత్య విషయం చెప్పినట్లు సమాచారం. హత్య జరిగిన ప్రదేశాన్ని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు.