20-03-2025 01:32:29 AM
భూసేకరణ, నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం, మార్చి 19 ( విజయక్రాంతి ):- మున్నేరు నది కిరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణతో పాటు, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం అయన పనులను పరిశీలించారు.
మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల మ్యాప్ లను పరిశీలించి, వరదలు వస్తే ఎంత మేరకు నీరు చేరుతుంది, అధికంగా ఫోర్స్ తో నీటి ప్రవాహం వచ్చినప్పుడు తట్టుకునేందుకు రిటైనింగ్ వాల్ లో నాణ్యత, నిర్మాణంలో మెటీరియల్, వాల్ క్యూరింగ్ విషయాలలో పాటించాల్సిన జాగ్రత్తలను కలెక్టర్ అధికారులకు, గుత్తేదారులకు వివరించారు. రిటైనింగ్ వాల్ ప్రక్కన మున్నేరు ఉన్నది అనే ఆనవాళ్ళు పోకుండా నిర్మాణంలో చర్యలు తీసుకోవాలని సూచించారు.
భవిష్యత్తులో ఎక్కువ మొత్తంలో వరద వచ్చిన కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రవాహ సామర్థ్యం అంచనాతో శాస్త్రీయంగా నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. మున్నేరు వాల్ కు ఆనుకొని రోడ్డు, రోడ్డు ప్రక్కన డ్రైనైజీ కాలువ నిర్మిస్తున్నామని అన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిని ఇచ్చి, భూసేకరణ చేసేలా అధికారులు రైతులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు.
భూనిర్వాసితులకు అభివృద్ధి చేసిన భూములు ప్రత్యామ్నాయంగా అందించి త్వరగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి పనుల పురోగతిపై రోజువారి నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఇ యం. వెంకటేశ్వర్లు, డి.ఇ. రమేష్, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఆర్.ఐ. క్రాంతి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.