calender_icon.png 14 October, 2024 | 4:48 AM

పంచాయతీ భూమికి మున్సిపాలిటీ నంబర్!

14-10-2024 12:31:05 AM

  1. కోర్టునూ తప్పుదోవ పట్టించిన అక్రమార్కుడు 
  2. తప్పుడు అఫిడవిట్‌తో ఆక్రమణపై స్టేటస్ కో
  3. ప్రతివాదులుగా జిల్లా కలెక్టర్, తహసీల్దార్ 
  4. వెలుగుచూసిన హెచ్ కన్వర్షన్ హాల్ భాగోతం
  5. ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని ప్రజల విజ్ఞప్తి

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ ౧౩ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో కండ్లముందే అక్రమాలు చోటుచేసుకొంటున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పదించకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది.

దీంతో చట్టం ఉన్నవాడి చుట్టం అనే నానుడి ఇక్కడ అమలవుతోందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. పాల్వంచలోని హెచ్ కన్వెన్షన్ హాల్ భాగోతాలు ఒక్కటొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. సదరు కన్వెన్షన్ హాల్ య జమాని తన ఫంక్షన్ హాల్‌ను రెవెన్యూ అధికారులు కూల్చడానికి వస్తున్నారని కొత్తగూ డెం జిల్లా ప్రధాన న్యాయస్థానంలో 2022 లో పిటిషన్ దాఖలు చేశారు.

వాస్తవంగా ఏజెన్సీలో భూవివాదం తలెత్తితే బాధితుడు కలెక్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, అఫిడవిట్‌తో సివిల్ కోర్టు అయిన జిల్లా ప్రధాన కోర్టులో పిటిషన్ దాఖలు చేసి స్టేటస్‌కో పొందిన వైనం చర్చనీయాంశంగా మారింది.

ఓఎస్ నెం 21/2022 ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. కలెక్టర్, తహసీల్దార్‌ను ప్రతివాదులుగా పేర్కొంటూ సదరు వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దానికి మున్సిపల్ టాక్స్ బిల్లులు, ఫైర్, పోలీస్, లేబర్ తదితర శాఖల నుంచి ఎన్వోసీ ధ్రువీకరణ పత్రాలు కోర్టుకు సమర్పించి తనకు అనుకూలంగా స్టేటస్ కో పొందారు. 

ప్రభుత్వ భూమిలోనే నిర్మాణం.. తహసీల్దార్ కౌంటర్

ప్రతివాదుల తరుఫున అప్పటి తహసీల్దార్ హెచ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణం సర్వే నెం 61/1లో ప్రభుత్వ భూమిలోనే నిర్మించారని, అది కేశవాపురం గ్రామపంచాయతీ పరిధిలోని సోములగూడెం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉందని కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఒక రెవెన్యూ అధికారి ఆ భూమి పంచాయతీ పరిధిలో ఉందని స్పష్టం చేసినా, మున్సిపల్ అధికారులు 20 ఇందిరాకాలనీ పరిధిలో ఉందని ఎలా ఇంటి నంబర్ ఇచ్చారో ఆశ్చర్యం కల్గిస్తోంది.

పంచాయతీ భూములపై మున్సిపల్ అధికారుల పెత్తనం విడ్డూరంగా ఉంది. తగదునమ్మా అంటూ హెచ్ కన్వెన్షన్ హాల్‌కు పోలీస్‌శాఖ, లేబర్ డిపార్డుమెంటు, అగ్నిమాపక శాఖలు సైతం ఎన్వోసీలు జారీ చేయడం గమనార్హం. అంటే ఆయా ప్రభుత్వ శాఖలను కూడా తప్పుదోవ పట్టించాడా ఘనుడు. దర్జాగా గిరిజన చట్టాలైన 1/70ని తుంగలో తొక్కి వ్యాపార సముదాయాల నిర్మాణం చేస్తుంటే అధికారులు చోద్యం చూడటం విస్మయాన్ని కల్గిస్తోంది.

పంచాయతీ భూమిలో నిర్మించిన వాటికి మున్సిపాల్టీ అధికారులు నంబర్లు ఎలా కేటాయించారన్న అంశంపై సీడీఎంఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా రెవెన్యూ అధికారి ఇచ్చిన కౌంటర్‌పై జిల్లా కలెక్టర్ దృష్టిసారించి పూర్తిస్థాయిలో విచారణ చేసి, వాస్తవాలను వెలికి తీయాలని, రూ కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని పాల్వంచ ప్రజలు కోరుతున్నారు.