06-03-2025 08:52:46 PM
సీఐటీయూ డిమాండ్...
కామారెడ్డి (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న రెండు నెలల మున్సిపల్ వర్కర్స్ (Muncipal workers) జీతాలను వెంటనే చెల్లించాలని గురువారం సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ వద్ద ధర్నా నిర్వహించారు. పీఎఫ్‌ను సరిచేయాలని కోరుతూ మున్సిపల్ సిబ్బంది పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా మున్సిపల్ అధికారులు, జిల్లా స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ స్పందించి మున్సిపల్ కార్మికుల జీతాలు ఇవ్వాలని కోరారు. అధికారులు రాజకీయ తొత్తులుగా మారి కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు.
మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి కార్మికులతో మాట్లాడుతూ... కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళనను విరమించారు. 60 సంవత్సరాలు దాటిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని, లేనిపక్షంలో రిటర్మెంట్ కింద రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా 5వ తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే రాజనర్సు, సంతోష్, మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్, కాట్రియాల ప్రభు, నాయకులు ఎర్రోలు నరసవ్వ, భూదవ్వ, ఎర్రోళ్ల నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు.