24-03-2025 12:51:54 AM
టాస్క్ ఫోర్స్ నివేదికలు బుట్ట దాఖలు
ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు
జిల్లాలో అమలు కాని నూతన పురపాలక చట్టం
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 23 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జంట పట్టణాలైనా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలో అనుమతి లేకుండా ఇబ్బడి ముబ్బడిగా బౌల అంతస్తు నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ నిర్మాణాలకు పొరపాలక అధికారుల అండదండలు మెండుగా ఉన్నట్లు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పొరపాలక శాఖ నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ పాలసీని రెండు పట్టణాల్లోనూ అమలు చేయాల్సి ఉన్న వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సెట్ బ్యాక్ లేకుండా భవన యజమానులు బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా చేపడుతున్న వాటిని నివారించే నాదుడే కరువయ్యారు.
మున్సిపల్ అధికారులు బహుళ అంతస్తుల నిర్మాణదారులతో మందస్తుగానే ముడుపుల సెటిల్మెంట్లు, ఒప్పందాలు చేసుకొని అనుమతి లేని నిర్మాణాలకు సహకరిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా ఉందని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నూతన పురపాలక చట్టాన్ని 2019లో అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారము అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనాలకు ఎలాంటి అనుమతులు లేకుండా నేలమట్టం చేయడంతో పాటు, నిర్మాణదారుడు కి మూడు సంవత్సరాల కారాగారా శిక్ష, మార్కెట్ విలువకు 25 రెట్లు పెనాల్టీ విధించేలా నిబంధనలను చేశారు.
అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాలు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి ప్రతి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై సర్వే నిర్వహించి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ ఆదేశం మేరకు 2021 అక్టోబర్ లో పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలలో టాస్క్ఫోర్స్ బృందం పర్యటించి కొత్తగూడెంలో సుమారు 120, పాల్వంచలో 180 భవనాలకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నట్లు గుర్తించారు.
గుర్తించటం తో పాటు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పాల్వంచలో 50 భవనాలకు, కొత్తగూడెంలో 30 భవనాలకు టాస్క్ ఫోర్స్ అధికారులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం జరిగింది. టాస్క్ ఫోర్స్ అధికారులు తమ పని తాము చేసి నివేదికలు సమర్పించినా మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం భవన నిర్మాణ యజమానులతో మున్సిపల్ అధికారులు లోపాయకార ఒప్పందాలు అనే ఆరోపణలను ధ్రువపరుస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన భవనాలు ప్రస్తుతం అన్ని దర్జాగా పూర్తి చేసుకొని యజమానులు అనుభవిస్తున్నారు. చట్టం ఉన్నవాడి చుట్టం అన్న నానుడి ఈ రెండు పట్టణాల్లో ఆచరణలో రుజువైందని తెలుస్తోంది.
పట్టణాల్లోనే కాదు ఏజెన్సీ మండలాలైన చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవి పల్లి మండలాల్లో సైతం నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి, బహుళ అంతస్తుల నిర్మాణాలు దర్జాగా చేపట్టారు. షాపింగ్ మాల్స్, షో రూములకు లీజుకు ఇచ్చి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు అక్రమార్కుల ఆమ్యామ్యాలకు తలొగ్గి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెలువడుతున్నాయి. పాల్వంచలో గట్టాయిగూడెం అల్లూరి సెంటర్లో 60 అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తుల భవనం నిర్మించారంటే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో ఇట్టే చెప్పవచ్చు. కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణానికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన మున్సిపల్ అధికారులు అమలు చేయలేదంటే వారి పనితీరుకు అద్దం పడుతుంది.
కొత్తగూడెంలో ఓ బహుళ అంతస్తులు నిర్మాణం యజమానికి మున్సిపల్ అధికారులు నోటీసు జారీ చేసి చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేశారు. దీంతో పాల్వంచ కొత్తగూడెం పట్టణాల్లో అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మున్సిపల్ శాఖ కమిషనర్ పాల్వంచ కొత్తగూడెం మున్సిపాలిటీల అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జంట పట్టణాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.