calender_icon.png 15 January, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కమిషనర్, సిబ్బంది అరెస్టు

08-08-2024 02:57:35 AM

విచారణలో తవ్విన కొద్దీ వెలుగులోకి వస్తున్న అక్రమాలు

బాధితులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ

జగిత్యాల,  ఆగస్టు 7 (విజయ క్రాంతి ): కబ్జా చేసిన భూమిలో సగం తమకు ఇవ్వాలంటూ అక్రమార్కులకు కొమ్ముకాసిన జగిత్యాల మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు, కొందరు మున్సిపల్ సిబ్బంది కటకటాల పాలయ్యారు. జగిత్యాల జిల్లాలో ఇటీవల భూముల ధరలు  ఒక్కసారిగా పెరిగిపోవడంతో.. కబ్జాదారులు ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లను సృస్టించి ఆయా స్థలాలను ఇతరులకు అమ్మి సొమ్ముచేసుకుంటన్నారు. స్థలాలు కొనేందుకు వచ్చిన కస్టమర్లకు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో ఉన్న అధికారులు, సిబ్బంది సహాయంతో నకిలీ వీఎల్టీ, అసెస్మెంట్ నంబర్లను కేటాయిస్తూ బురిడీ కొట్టించారు.

ఈ క్రమంలో కొంతమంది కబ్జాదారులు... తమకు సహకరించే మున్సిపల్ కమిషనర్లకు తాము కబ్జా చేసిన భూముల్లో సగానికి పైగా వాటాలు ఇస్తుండటంతో జిల్లాలో కబ్జాదారులు ఆడిందే ఆట..పాడింతే పాటగా తయారైంది.  సర్వే నంబర్ 1599లో గల 12గుంటల భూమిని పుల్ల భాగ్యలక్ష్మి నుంచి కీర్తి విజయలక్ష్మీ, పూటూరి గీతారాణి, కొత్తపెల్లి సత్యనారాయణకు జాయింట్ ప్రాపర్టీ కొనుగోలు చేశారు. ఈ స్థలం 2018లో మున్సిపాలిటీలో విలీనం కాగా స్థలం విలువ నాలుగు రెట్ల వరకు పెరిగింది. ఆ స్థలంలో వాటా ఆశించిన మున్సిపల్ అధికారులు..  పాపానికి ప్రాయిచిత్తం చెల్లించుకున్నారు.

ముందుగా ఆ స్థలానికి సంబంధం లేని కొందరికి ఆ భూమి చెందినదిగా వీఎల్టీ(వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) నంబర్‌ను కేటాయించారు. ఈ నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏర్పాటు చేసుకోగా రిజిస్ట్రార్ రిజెక్ట్ చేయడంతో అసలు విషయం బయట పడింది. సమాచారం తెలుసుకున్న సదరు భూ యజమానులు.. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం కలెక్టర్ వరకు వెళ్లడంతో భూ ఆక్రమణలకు యత్నించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని..కలెక్టర్ ఆదేశించారు.

ఈ క్రమంలో లోతుగా విచారించడంతో అక్రమదారులతో కుమ్మక్కైన అవినీతి అధికారుల భాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. వారుచేసిన మోసాలకు సంబంధిచి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అవినీతికి పాల్పడిన మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు, ఆర్‌ఓ ప్రసాద్, పలువురు సిబ్బందిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.