రికార్డులు స్వాధీనం..పేర్లు మార్పు..
పటాన్ చెరు, (విజయక్రాంతి): పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని 11 గ్రామాలలో పురపాలిక పాలన మంగళవారం నుండి ప్రారంభమైంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం పాఠకులకు విధితమే. ఇందుకు అనుగుణంగా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, ఐలాపూర్ తాండ, పటేల్ గూడ, కిష్టారెడ్డిపేట, సుల్తాన్పూర్ దాయర గ్రామాలు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోకి, పటాన్ చెరు మండల పరిధిలోని పాటి, కర్థనూరు, ఘనాపూర్, ముత్తంగి, పోచారం గ్రామాలు తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి.
మంగళవారం ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు గ్రామపంచాయతీ అధికారులతో సమావేశమై రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామపంచాయతీ బోర్డులను సైతం మున్సిపాలిటీలుగా మార్చారు. ప్రస్తుతం పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను మున్సిపాలిటీలలో పనిచేయడానికి ఇష్టంగా ఉన్నారా అంటూ అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అమీన్పూర్ మండల పరిధిలోని ఆరు గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. నేటి నుండి పూర్తిస్థాయిలో మున్సిపల్ పరిపాలన ప్రారంభమవుతుందన్నారు. ప్రజల అవసరాల నిమిత్తం కొద్ది రోజులపాటు ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.