ముంబై, జూలై 12 : దేశ ఆర్థిక రాజధాని ముంబైని మరోసారి వాన ముంచెత్తింది. సోమవారం కురిసిన భారీ వర్షంతో నగరం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం మరోసారి కుంభవృష్టి కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో నగరంలో సగటున 93.16 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వర్షం కారణంగా విమాన సర్వీసులకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ముంబైలో దట్టమైన మేఘాలు ఆవరించడంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.