28-08-2024 12:31:55 AM
నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
మంత్రులు పొన్నం, దుద్దిళ్ల ఆదేశాలు
ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఉత్సవ కమిటీలు, అధికారులతో సమీక్ష
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27(విజయక్రాంతి): ముంబై తరహాలో హైదరా బాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ కార్యాలయంలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యు లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో గణేశ్ ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సెప్టెంబరు 7 నుంచి 11 రోజుల పాటు జరిగే గణేశ్ ఉత్సవాలను ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా జరుపుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీసీకెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, బాలాపూర్ ఉత్సవ కమిటీలకు అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపారు. రోడ్లపై ఉన్న గుంతలను యుద్ధ ప్రాతిపధికన పూడ్చివేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం రవాణాశాఖ, మెట్రోలో తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. మొబైల్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలి: మంత్రి శ్రీధర్‌బాబు
ప్రకృతిని కాపాడేందుకు ప్రతిపౌరుడి సహకారం అవసరమని, అందుకోసం మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మట్టి విగ్రహాల ప్రతిష్టాపన కోసం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. చెట్లు కొమ్మలు అడ్డురా కుండా తొలగించాలని, వేలాడుతున్న విద్యుత్‌వైర్లను తొలగించి సర్వీస్ రోడ్ల మరమ్మ తులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు.