21-04-2025 01:58:14 AM
ముంబై హ్యాట్రిక్ విజయాలు.. ఆరో స్థానానికి ఎగబాకిన హర్దిక్ సేన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (73*), దేవదత్ పడిక్కల్ (61) చెలరేగడంతో ఆర్సీబీ మరో సునాయస విజయం సాధించింది.
పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సత్తా చాటాడు. గత రెండు మ్యాచుల్లో అదరగొట్టిన పంజాబ్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. పంజాబ్ బ్యాటర్లు విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కాపాడలేకపోయారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. 158 పరుగుల లక్ష్యంతో ఇంకా 7 బంతులు మిగిలుండగానే.. విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్, సుయాశ్ చెరి రెండు వికెట్లు, షెఫర్డ్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి ఎగబాకింది.
మరోసారి మురిసిన ముంబై
ఆదివారం మ్యాచ్‌లో కూడా ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి చెన్నైకి మొదట బ్యాటింగ్ అప్పజెప్పిన ముంబై చెన్నైని కట్టడి చేయడంలో సఫలం అయింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
చెన్నైలో జడేజా (53*), శివమ్ దూబే (50) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా 2, సాంట్నర్, అశ్వనీ కుమార్, చాహర్ తలో వికెట్ తీసుకున్నారు. 177 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ముంబైకి అదిరే ఆరంభం లభించింది. రోహిత్ శర్మ (76*) ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు.
శర్మకు తోడు వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (68*) కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో ముంబై పని సులువయింది. ఇది ముంబైకి వరుసగా హ్యాట్రిక్ విజయం. ఇంకా 26 బంతులు మిగిలుండగానే ముంబై గెలుపుబావుటా ఎగరేసింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దూసుకెళ్లింది. నేడు గుజరాత్, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి.