calender_icon.png 12 October, 2024 | 1:58 PM

గ్లోబల్ నగరాల్లో రెండో ర్యాంక్‌లో ముంబై

24-08-2024 12:30:00 AM

ఇండ్ల ధరల పెరుగుదలపై నైట్ ఫ్రాంక్ రిపోర్ట్

న్యూఢిల్లీ, ఆగస్టు 23: అధికంగా ఇండ్ల ధరలు పెరుగుతున్న ప్రపంచ నగరాల్లో ముంబై రెండో ర్యాంక్‌లోనూ, ఢిల్లీ మూడో ర్యాంక్‌లోనూ నిలిచాయి. ప్రైమ్ ఏరియాల్లో ఉన్న  రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు జూన్ త్రైమాసికంలో ఎక్కువగా పెరిగిన 44 అంతర్జాతీయ నగరాల జాబితాను తాజాగా ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ విడుదల చేసింది. 2024 క్యాలండర్ సంవత్సరం రెండో త్రైమాసికంలో అధికంగా పెరిగిన నగరాల్లో ఫిలిప్పీన్స్ మనీలా అగ్రస్థానంలో ఉన్నది. ఈ నగరంలో ఏకంగా రెసిడెన్షియల్ ఆస్తుల ధరలు 26 శాతం పెరిగాయి.

ముంబైలో వార్షిక పెరుగుదల 13 శాతంకాగా, న్యూఢిల్లీలో 10.6 శాతం అధికమయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసి కంలో ఈ రెండు నగరాలు వరుసగా 6, 26 ర్యాంక్‌ల్లో ఉన్నాయి. బెంగళూరులో వార్షిక పెరుగుదల 3.7 శాతం కాగా, ఈ నగరం ర్యాంక్ 15 వద్ద స్థిరంగా ఉన్నది. గ్లోబల్ నగరాల్లో యూఎస్‌లోని లాస్ ఏంజిల్స్ 4వ స్థానంలో (ధరల పెరుగుదల 8.9 శాతం) ఉండగా, మియామి తదుపరి స్థానంలో (7.1 శాతం) నిలిచింది.

నైరోబి (6.6 శాతం), మాడ్రిడ్ (6.4 శాతం), లిస్బన్ (4.7 శాతం), సియోల్ (4.6 శాతం), శాన్‌ఫ్రాన్సిస్కో (4.5 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2020 నుంచి 124 శాతం పెరిగిన దుబాయ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు తాజా త్రైమాసికంలో 0.3 శాతమే పుంజుకున్నాయి. వియన్నాలో 3.2 శాతం, బ్యాంకాక్‌లో 3.9 శాతం చొప్పున ధరలు తగ్గాయి. 44వ ర్యాంక్‌లో నిలిచిన న్యూజిలాండ్ నగరం వెల్లింగ్‌టన్‌లో ధరలు వార్షికంగా 5.9 శాతం తగ్గాయి.