చెరువుల్లా మారిన రోడ్లు
ఒకేరోజు 31 సెంటీమీటర్ల వాన
50 విమానాలు రద్దు
స్కూళ్లు, కాలేజీలకు సెలవు
న్యూఢిల్లీ, జూలై 8 : ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎన్నడూ లేనంతగా కేవలం ఆరు గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 31.5 సెంటీమీటర్లు, పోవాయ్‌లో 31.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయి. పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
50 విమాన సర్వీసులు రద్దు..
భారీ వర్షాల కారణంగా 50కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 27 విమానాలను దారి మళ్లించారు. ఆ విమానాలన్నీ హైదరాబాద్, అహ్మదాబాద్, ఇండోర్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు.