21-04-2025 12:26:22 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 20 ( విజయ క్రాంతి : భూ భారతి చట్టం వల్ల రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
భూ భారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం ఆమె నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, దోమలపల్లి రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు తెలంగాణ భూ భారతి (భూమి హక్కుల చట్టం -2025) పై అవగాహన కల్పించారు.
ధరణిలో ఎలాంటి సవరణలు చేసేందుకు అవకాశం ఉండేది కాదని,భూ భారతి లో రికార్డులను అప్ డేట్ చేసే అవకాశం ఉందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదటే భూములు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం భూ భారతిలో ఉందని తెలిపారు.
ధరణిలో అనుభవదారు కాలం లేదని, భూ భారతిలో అనుభవదారుకు ప్రాధాన్యత ఉంటుందని ,మొఖా మీద ఉంటే పట్టా అమలవుతుందని,భూ భారతిలో భూములకు సంబంధించిన వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయబడతాయని, ఈ వివరాలన్నీ అన్ని శాఖలకు పంపించడం జరుగుతుందని ,ఎవరైనా ఈ వివరాలను చూసుకోవచ్చని, వీటిని సవరించే అధికారం ఆన్లైన్ లో ఉండదని, కేవలం సంబంధిత అధికారులకు మాత్రమే ఉంటుందని తెలిపారు .
రైతులకు ధరణిలో లేని ఎన్నో వెసులుబాటులన్నీ భూ భారతి చట్టం కల్పిస్తుందని, ఇందులో అప్పిల్ అవకాశం ఉందని ,గతంలో భూముల సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ రైతులు తిరిగే వారిని, ఇప్పుడు ఆ అవసరం లేదని తెలిపారు. భూ భారతి ద్వారా అసైన్ భూములు ,పిఓటి భూములు ,సాదా బైనమా వంటి అన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
తమ ప్రభుత్వం భూ భారతి వంటి ప్రతిష్టాత్మక చట్టంతో పాటు, 6 గ్యారంటీలను అమలు చేస్తున్నదని, సన్నబియాన్ని ఇస్తున్నదని చెప్పారు. అంతేకాక బైపాస్ రోడ్డు, డబుల్ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి సంక్షేమ పథకాలన్నింటిని, వాగ్దానాలన్నింటిని సంవత్సరంలో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఆర్డిఓ అశోక్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, వైస్ చైర్మన్ వెంకన్న, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు మాట్లాడారు.