01-04-2025 11:39:13 PM
చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీదేవి..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఓ పక్క మహిళల పట్ల సామూహిక అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితుల్లో మరోపక్క అందాల పోటీలను నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీదేవి మండిపడ్డారు. మంగళవారం ఊరుకొండ పేట అంజన్న ఆలయ పరిసరాల్లో జరిగిన ఘటనస్థలిని పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ... మహిళ అంటే శారీరక అందాలను చూపించే వస్తువుగా ప్రభుత్వం స్పాన్సర్ చేయడం, మల్టీ నేషనల్ కంపెనీలకు మహిళల అందాలను ఎరగా వేసి మహానగరాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలను కోవడం సరైన పద్ధతి కాదన్నారు. అత్యాచారాలను నియంత్రించకుండా, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వట్టి మాటలతో చేతులు దులుపుకుంటున్నాయని ఆవేదన చెందారు. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు ఎంత పెద్ద పదవులలో ఉన్నా మహిళలకు కూడా ఈ అత్యాచారాల లైంగిక వేధింపులు తప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు చైతన్య మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కస్తూరి, సభ్యులు చంద్రకళ, శాంత పాల్గొన్నారు.