- తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మేధావి
- 1952లో ఓటమితో రాజకీయ రంగప్రవేశం
- 1957 నుంచి 1972 వరకు 4 సార్లు విజయకేతనం
- ప్రధానిగా దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన వ్యక్తి
- ‘సహస్ర ఫణ్’కు కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు
- 2004 డిసెంబర్ 23న గుండెపోటుతో అస్తమయం
హైదరాబాద్, డిసెంబర్ ౨౩(విజయక్రాంతి): భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్న సమయంలో మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టి చక్కదిద్దాడు. తెలంగా ణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మే ధావి. రాజకీయ రంగంలో శాసనసభ్యుడిగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించారు.
కవిగా, అనువాదకుడుగా, పాత్రికేయుడిగా, కథకుడిగా, నవలా రచయితగానే కాకుండా పద్నాలుగు భాషలు మాట్లాడగలిగిన బహుభాషావేత్తగా సుపరిచితుడు. 1983లో న్యూఢిల్లీలో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫెడల్ కాస్ట్రోను అబ్బురపరిచాడు. పీవీ తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిలో ౫౦ ఎకరాలను భూదానోద్యమానికి దానమిచ్చాడు.
బాల్యం, విద్యాభ్యాసం
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో సీతారామారావు, రుక్మాబాయమ్మ దంపతులకు 1921 జూన్ 28న పీవీ నరసింహారావు జన్మించాడు. కాగా, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయిలు పీవీని దత్తత తీసుకున్నారు. చదువుకునే రోజుల్లో ఆయన ఎప్పుడూ క్లాస్ ఫస్టే.
తానెప్పుడూ తరగతిలో సెకెండ్ రావడం ఎరుగనని ’ఐ విట్నెస్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి పీవీ చెప్పారు. 1936లో హనుమకొండలో డిస్టింక్షన్ మార్కులతో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. 1938లో నిజాం రాష్ట్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడంతో ఆయన రాష్ట్రంలో ఎక్కడా చదవకుండా నిర్బంధం విధించారు.
దీంతో పీవీ మహారాష్ట్రలోని పుణెలో బీఎస్సీ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్‌గా పనిచేశారు.
దేశ రాజకీయాల్లో..
1977లో పీవీ నరసింహారావు కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించాడు. హనుమకొండ నుంచి లోకసభకు ఎన్నికై హోం, విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 1984లో హనుమకొండ నుంచి ఓడినా.. మహారాష్ట్రలోని రాంటెక్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి రాజీవ్‌ంధీ మంత్రివర్గంలో మానవ వనరుల శాఖ, హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
రాజీవ్‌గాంధీ మరణాంతరం 1991లో జరిగిన ఎన్నికల తర్వాత దేశరాజకీయ రంగంలో ఒక అనిశ్చితి ఏర్పడింది. అప్పుడు తన రాజకీయ చతురతతో మిత్రపక్షాల ముద్దతు మాడగట్టి పీవీ ప్రధానమంత్రిగా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
పాత్రికేయుడిగా.. సృజనశీలిగా..
1948లో ‘కాకతీయ’ పత్రికను స్థాపించి తొలితరం పత్రికా రచయితలలో ఒకడయ్యాడు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలను హిందీలోకి ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించాడు. ఈ రచనకు ఆయన కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు పొందాడు.
పీవీ రాజకీయ, సాహిత్య అనుభవాలను రంగరించి ఆంగ్లంలో రాసిన ‘ది ఇన్సైడర్’ అనే నవలకు విశేష ప్రాచుర్యం లభించింది. దేశహితాన్ని కోరిన స్థితప్రజ్ఞుడు, సంక్షోభ సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థను ఒడ్డుకు చేర్చిన అసామాన్యుడు! తనవారితోపాటు దేశాన్ని దుఃఖ సాగరంలో ముంచి 2004 డిసెంబర్ 23న గుండెపోటుతో కన్నుమూశారు.
రాజకీయ ప్రస్థానం
1952లో స్వతంత్ర భారత తొలి సాధారణ ఎన్నికల్లో ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి చేతిలో పీవీ ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత 1957 నుంచి 1972 వరకు నాలుగుసార్లు మంథని శాసనసభ నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేశారు. 1962లో రెండోసారి శాసనసభకు ఎన్నికైన పీవీ రాష్ట్ర జైళ్లు, ప్రజాసంబంధాలు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
మూడోసారి గెలిచాక పీవీని ముఖ్యమంత్రి పదవి వరించింది. తాను సీఎంగా ఉన్నప్పుడే భూసంస్కరణలు అమలుపరిచేందుకు చర్యలు చేపట్టాడు. అయితే పీవీ ముఖ్యమంత్రి పదవి పోవడానికి భూసంస్కరణ చట్టమే కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.