మందమర్రి,(విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఆలయాలను సుందరంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం తెల్లవారుజాము నుండి ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు దర్శించేందుకు ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం, పాలచెట్టు ఏరియాలోని పంచముఖి హనుమాన్ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గత వారం రోజులుగా వెంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.ముక్కోటి ఏకాదశినీ పురస్కరించుకొని ఆలయంను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకటించారు.
భక్తులకు స్వాగతం పలికేలా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.ఉత్తర ద్వారా దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించేందుకు వేలాది మంది భక్తులు వెంకటేశ్వర ఆలయం కు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ, సింగరేణి యాజమాన్యం సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలు, త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు దేవస్థానం కమిటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.
శుక్రవారం తెల్లవారుజాము నుండి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి వారిని దర్శనం కలిగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని వెంకటేశ్వర దేవాలయం ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి ఆనంత చారి,పంచముఖ హనుమాన్ ఆలయ పూజారి కృష్ణకాంత చార్యులు భక్తులను కోరారు. ఇది ఇలా ఉండగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ కె శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.