ఉత్తర ద్వారంలో రామయ్య దర్శనం తిలకించి తరించిన భక్తజనం
రామనామ స్మరణలతో మారు మోగిన భద్రాద్రి
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామయ్య ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వగా అఖిలాండ భక్తజనులు ఆ సుందర దృశ్యాన్ని తిలకించి పులకించారు. జై శ్రీరామ్... జై జై శ్రీరామ్ అంటూ జయ జయ ధ్వానలు చేశారు. ఉత్తర ద్వారం లోపల దేవాలయం అర్చకులు దట్టంగా సాంబ్రాణి పొగ వేసి సరిగ్గా ఐదు గంటలకు ద్వారాలు తెరవగా సాంబ్రాణి పొగ మబ్బులు విడిపోతూ ఆ మబ్బు తెరల నుండి భద్రాద్రి రామయ్య దర్శన భాగ్యం కలగటంతో ఆ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు తన్మయత్నంతో పులకించిపోయి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు ముక్కోటి విశిష్టతను హాజరైన భక్తులకు వివరించారు.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీవీఐపీ, వీఐపీ సెక్టార్ లతో పాటు ఇతర సెక్టార్లలోని భక్తులు వేడుకను నేరుగా తిలకించగా ఏ రాష్ట్రాలకు చెందిన ప్రజలు టీవీల ద్వారా వీక్షించారు. స్థానాచార్యులు భక్తులకు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించగా. అర్చకులు 108 ఒత్తులతో వెలిగించిన హారతిని భక్తులు అందుకున్నారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం తర్వాత ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రతి సెక్టార్ లో ఏర్పాట్లు పర్యవేక్షణ కు జిల్లా అధికారులను, లైజన్ అధికారులను నియమించారు. బందోబస్తు ఏర్పాట్లును ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షించారు.
వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి సతీమణి మాధురి రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం, పినపాక, ఇల్లందు, శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్ రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్ ఐటిడిఎ పిఓ రాహుల్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ దంపతులు, ఎఎస్పీ విక్రాంత్ సింగ్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్. దేవస్థానం ఈ ఓ రమాదేవి తదితరులు హాజరయ్యారు. భక్తరామదాసు కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం భద్రాచలం తహసీల్దార్ శ్రీని వాస్ మూలవరులకు స్నపనం నిర్వహించారు. ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం వైకుంఠరాముడు తిరువీధి సేవకు తరలివెళ్లారు. ఈరోజు నుండి 20 తేది వరకు రాపత్తు ఉత్సవాలు ప్రారంభం.
వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం విజయవంత కావడం పట్ల జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్సవాలు నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన భక్తులకు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు.