షార్జా: అఫ్గానిస్థాన్ సీనియర్ ఆల్‌రౌండర్ మమ్మద్ నబీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అనంతరం నబీ రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు ఆఫ్గన్ క్రికెట్ బోర్డు తెలిపింది. 2009లో తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన నబీ ఇప్పటివరకు 167 వన్డేలాడి 3600 పరుగులతో పాటు బౌలింగ్‌లో 172 వికెట్లు పడగొట్టాడు.
టెస్టులకు ఇది వరకే రిటైర్మెంట్ ప్రకటించిన నబీ ఇకపై టీ20ల్లో కొనసాగనున్నాడు. ‘గతేడాది వన్డే వరల్డ్‌కప్ ముగియగానే రిటైర్ అవుదామనుకున్నా. కానీ మా జట్టు చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిందని తెలిసింది. దీంతో ఆ ట్రోఫీ అనంతరం వీడ్కోలు పలకాలని అనుకుంటున్నా’ అని నబీ తెలిపాడు. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను అఫ్గానిస్థాన్ 2-1తో నెగ్గింది. సోమవారం రాత్రి జరిగిన చివరి వన్డేలో అఫ్గాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.