17-03-2025 12:00:00 AM
యూనెస్కో తాత్కాలిక జాబితాలో చోటు
నారాయణపేట. మార్చి 16(విజయక్రాంతి) : ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువు రాళ్ల (మెన్హిర్స్) ను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు.
నిలువు రాళ్లు, సప్తర్షి మండలంతో ఖగోళ పరిజ్ఞానాన్ని, కాలాలను, వాతావరణ మార్పులను ఆనాడే తెలుసుకునేవారని, కాలాలను గుర్తించడానికి ఆది మానవులు నిలువురాళ్లను ఓ క్రమంలో ఏర్పాటు చేసినట్లు చారిత్రక పరిశోధకులు, ఖగోళ శాస్త్రవేత్తలు మంత్రికి వివరించారు. ఎలాంటి సాంకేతికత లేని 4 వేల సంవత్సరాల క్రితమే రాళ్ల ద్వారా తెలుసుకోవడం అనేది ఆబ్బురపరిచేలా, అద్భు తంగా ఉందని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ& నిలువు రాళ్లకు యునెస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే మాత్రం ప్రపంచస్థాయిలో ప్రత్యేక స్థానం వీటికి దక్కుతుందని, ప్రపంచ పటంలో ముడ్ మల్ పేరు నిలుస్తుందన్నారు. అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వీటికి ప్రాధాన్యం ఉంటుందని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు, మౌలిక వసతులు మెరుగవుతాయని, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
నిలువురాళ్ల పరిరక్షణకు చర్యలు తీసు కుంటామని, పర్యాటక, చారిత్రక, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృషి, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, తెలంగాణ హెరిటేజ్శాఖ, టిటా గ్లోబల్ ట్రస్ట్ సహకారం వల్లే నిలువు రాళ్ళకు ఈ గుర్తింపు లభించిందని వెల్లడించారు.
ఈ ప్రాంత అభివృద్ధి, శాశ్వత గుర్తింపు కోసం తదుపరి కార్యాచరణ ప్రణాళిక, తదితర అంశాలపై త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ సైట్ లో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్, ఖగోళ శాస్త్ర విభాగ ప్రొఫెసర్ రుక్మిణి, డోసియర్ ఆర్కిటెక్ట్ నిపుణుడు సూర్యనారాయణ,హెరిటేజ్ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి, రీసెర్చ్ స్కాలర్ డా. ప్రవీణ్, ఆర్డీఓ రాం చందర్ నాయక్, డిఎస్పీ నల్లపు లింగయ్య, టిటా గ్లోబల్ ట్రస్ట్ నిర్వాహకులు సందీప్ మక్తలా, తదితరులు పాల్గొన్నారు.