calender_icon.png 22 January, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ముద్ర’ రుణ పరిమితి రూ.20 లక్షలకు పెంపు

24-07-2024 01:27:41 AM

చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారులకు మేలు

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్

న్యూఢిల్లీ, జూలై 23: ప్రధానమంత్రి ముద్ర యోజన రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెంచుతూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా వ్యాపారవర్గాల(ఎంఎస్‌ఎంఈ)కు ఎంతో మేలు జరుగనున్నది. స్టార్టప్‌లు ప్రారంభించే ఔత్సాహికులకు ప్రోత్సాహకంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించేందుకు 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకాన్ని ప్రారంభించి అప్రతిహతంగా కొనసాగిస్తున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షలాది మందికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల నుంచి పూచీకత్తు లేకుండా రూ.5.4 లక్షల కోట్ల విలువైన రుణాలు మంజూరు చేసింది.

ప్రారంభ రుణం ‘శిశు’ ద్వారా ఒక్కో వ్యక్తికి రూ.50,000 వరకు, ‘కిశోర్’ రుణం ద్వారా రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు, ‘తరుణ్’ ద్వారా రూ.10 లక్షల వరకు రుణం అందించింది. చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారవర్గాలపై ఆర్థికపరమైన ఒత్తిడి కొనసాగుతున్న సమయాన ముద్ర రుణాల పెంపు ఉపశమనాన్నిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆన్‌బోర్డింగ్ కోసం కొనుగోలుదారుల టర్నోవర్ థ్రెషోల్డ్‌ను రూ.500 కోట్ల నుంచి రూ.250 కోట్లకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారవర్గాలను ప్రోత్సహించే విధంగా 50 బహుళ ఉత్పత్తి విస్తరణ యూనిట్లకూ బడ్జెట్‌లో నిధులు కేటాయించామని వివరించారు.

వారు ఉత్పత్తి చేసే సంప్రదాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామిక పద్ధతిలో ఎగుమతి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐడీబీఐ) వచ్చే మూడేళ్లలో  చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు సేవలు అందించేందుకు కొత్తగా 24 బ్రాంచీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముద్ర రుణాలతో హస్తకళాకారులు, చేతివృత్తిదారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,  ఎస్సీలు, ఎస్టీలు, మహిళా పారిశ్రామిక వేత్తలు, చిరువ్యాపారుల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పీఎం విశ్వకర్మ, జాతీయ జీవనోపాధి మిషన్, స్టాండ్ అప్ ఇండియా వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు.