calender_icon.png 29 September, 2024 | 11:02 AM

జీవ నదిలా మూసీ

29-09-2024 12:37:48 AM

  1. త్వరలో సుందరీకరణ పనులు షురూ 
  2. వారంలోగా టెండర్లు 
  3. ఏడాదిలో మూడు ప్లాన్‌లు అందుతాయి 
  4. సౌత్ కొరియా చియాంగ్ చాంగ్ నదిని గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సందర్శిస్తాం
  5. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్  
  6. ఆక్రమణల వెనుక బలవంతులు 
  7. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మూసీ ప్రక్షాళన అంటే కేవలం బ్యూటీఫికేషన్ కాదని, నగరం వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా అభివృద్ది చెందుతుందని, నాటి నగర వారసత్వ సంపదను తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా నదికి పునర్జీవం తీసుకొచ్చి జీవ నదిలా మారుస్తామని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిశోర్ పేర్కొన్నారు.

మూసీ ప్రక్షాళన చర్యల్లో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు చేపడుతున్న చర్యల నేపథ్యంలో ప్రజలు భయబ్రా ంతులకు గురయ్యేలా సోషల్ మీడియా కథనాలు ఉంటున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో కలిసి శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

నగరంలో కురిసిన భారీ వర్షాలకు హుస్సే న్‌సాగర్‌తోపాటు జంట జలాశయాల నుంచి నీళ్లు వదిలితే ముందుగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారని, మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మూసీ నదిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

వర్షాల నుంచి హైదరాబాద్ ప్రజలను కాపాడుకోవడం కోసమే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుందని స్పష్టంచేశారు. దక్షిణ కొరియా సియోన్ నగరంలోని చియాంగ్ చాంగ్ నదిని అక్టోబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ ప్రజా ప్రతినిధులతో సందర్శిస్తామని చెప్పా రు. ఓఆర్‌ఆర్ నిర్మాణం తర్వాత నగర అభివృద్ది ఎలా జరిగిందో..

మూసీ ప్రక్షాళన ప్రా జెక్టు తర్వాత కూడా నగరం అంతే అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులను బలవంతంగా తరలించడం లేదని ఉద్ఘాటించారు. వారంతా డబుల్ బెడ్ రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. రెండు నెలల క్రితం చేపట్టిన డ్రోన్ సర్వేలో రివర్ బెడ్ ప్రాంతంలో 10,200 నిర్మాణాలు ఉన్నట్టు తేలిందని వివరించారు.

నిర్వాసితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ల్యాండ్ అక్విజేషన్ రిహేబిటేషన్ చట్ట ప్రకారం పట్టా ఉన్నవారికి డబుల్ పరిహారం అందుతుని తెలిపారు. నగరంలోని 14 ప్రాంతాల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు 15 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

మహిళా శక్తి పథకంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూ పుల ద్వారా నిర్వాసిత మహిళలకు జీవనాధారం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుం టుందని వివరించారు. 1908లో నగరానికి వచ్చిన భారీ విపత్తు కారణంగా మూసీ వరదలతో విపరీతమైన నష్టం వాటిల్లిందని చెప్పారు. ఆ సమయంలో సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డు ద్వారా 10 వేల మందిని తరలించినట్టు గుర్తుచేశారు.

మూసీ ప్రక్షాళన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలిపారు. వారం రోజుల్లో టెండర్లు ఖరారు అవుతాయని చెప్పారు. ఆ తర్వాత అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ రెడీ కానున్నట్టు వివరించారు. టెండర్ పొందిన ఏజెన్సీ ఏడాదిలో మూడు దఫాలుగా ప్లాన్ ఇస్తుందని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో పీపుల్స్ ప్లాజాలు, కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, హాకర్ జోన్లు, రిక్రేయేషన్ జోన్లు, వంతెనల నిర్మించనున్నట్టు తెలిపారు. రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

ఆక్రమణల వెనుక బలవంతులు : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 

ఆక్రమణల వెనుక కొందరు బలవంతులు ఉన్నారని, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలమనే ధీమాతో కొందరు బడా వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రాను ఒక బూచీగా చూపించి బుచ్చమ్మను పలువురు స్థానికులు భయబ్రాంతులకు గురిచేశారన్నారు.

హైడ్రా అంటే బూచీ కాదనీ, రాక్షసి కాదని చెప్పారు. హైడ్రా అంటే ఒక భరోసా అని, ఒక బాధ్యత అని ఉద్ఘాటించారు. ఇప్పటి వరకూ హైడ్రా కూల్చింది ఖాళీగా ఉన్న ఇళ్లను మాత్రమేనని స్పష్టంచేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్న ఇళ్లతోపాటు పేదలు నివాసం ఉంటే కూల్చడం లేదని వెల్లడించారు.

హైడ్రా సైలెంట్‌గా ఏమీ లేదనీ, హైడ్రా పని హైడ్రా చేస్తుందని పునరుద్ఘాటించారు. ధనవంతుల ఇళ్లను, ఫాంహౌస్‌ల జోలికి వెళ్లడం లేదనేది వాస్తవం కాదని అన్నారు. ఓఆర్‌ఆర్ పరిధిలో 565 చెరువులు ఉండగా, వాటిలో 136 చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్‌లను గుర్తించామని చెప్పారు. మిగతావి కూడా గుర్తించాకా.. ఈ వివరాలన్నింటినీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపారు.