15-04-2025 11:53:31 PM
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ
సమగ్ర విచారణ జరపాలని స్పెషల్ కోర్టు ఆదేశం
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం రేపిన ముడా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్త పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, లోకాయుక్త పోలీసులు సమర్పించిన ‘బీ రిపోర్ట్’పై తన నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది. తీర్పు ఇచ్చేముందు సమగ్ర తుది నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
కాగా బీ రిపోర్ట్‌ను ఈడీ, సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాల్ చేశారు. సిద్ధరామయ్యకు ఇచ్చిన క్లీన్ చిట్‌ను తిరస్కరించాలని కోర్టును కోరారు. వాదనలు విన్న కోర్టు విచారణను మే 7కు వాయిదా వేసింది. బీ రిపోర్ట్‌పై అభ్యంతరం దాఖలు చేసే అధికారం ఈడీకి ఉందని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తమ దర్యాప్తును కొనసాగించడానికి కోర్టు అనుమతి కోరిన లోకాయుక్త పోలీసులకు ఇప్పుడు అధికారికంగా అనుమతి లభించింది.