calender_icon.png 27 December, 2024 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ

01-08-2024 01:06:09 AM

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు సమానంగా నాలుగో నగరం

ఏది కావాలన్నా అక్కడికి రావాల్సిందే 

క్రికెట్ స్టేడియం కోసం బీసీసీఐని సంప్రదించాం

10 నెలల పాలనపై వందల ఆరోపణలా? 

సూచనల ముసుగులో కేటీఆర్ మోసం

సిరిసిల్ల కార్మికులతోనే బతుకమ్మ చీరలు నేయించారా? 

అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం సేకరించిన 20 వేల ఎకరాల్లో అద్భుత నగరాన్ని నిర్మించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్, సికింద్రా బాద్, సైబరాబాద్‌కు సమానంగా అక్కడ నాలుగో సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ నగరమే రాష్ట్ర భవిష్యత్ కాబోతోందని అసెంబ్లీలో ప్రకటించారు. దానికి మెట్రో సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నట్లు స్పష్టం చేశారు.

ప్రపంచంలో పెట్టుబడులకు స్వర్గధామంగా ఆ నగరాన్ని తీరిదిద్దుతామని చెప్పారు. వైద్యం, విద్య, నేపుణ్యం,  ఉద్యోగం, క్రీడలు.. ఇలా ఏ రంగంలోనేనా, ఏది కావాలన్నా ఫ్యూచర్ సిటీ ముచ్చర్లకు రావాల్సిందేనని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఫార్మాసిటీ, బతుకమ్మ చీరలు, చేనేత కార్మికులతోపాటు ఇతర అంశాల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డి దీటుగా బదులిచ్చారు.

సూచనల ముసుగులో మోసం అనే ప్రణాళికను కేటీఆర్ ప్రజల మెదళ్లలో జొప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాలన చూసిన తర్వాతే బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ నాయకులు, 10 నెలలు కూడా పూర్తి కాని కాంగ్రెస్ పాలనపై వందల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 20 వేల ఎకరాల భూసేకరణపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటున్నారని అన్నారు. 

కాలుష్య రహిత నగరం

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ముచ్చర్లలో నాలుగో సిటీని నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ముచ్చర్లలోని ౨౫ వేల ఎకరాల్లో కాలుష్య పరిశ్రమలు పెడితే ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. గతంలో 35 ఎకరాల్లో ఉన్న సిరీస్ కంపెనీ వల్ల చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో ఎంతటి కాలుష్యం ఏర్పడిందో అందరూ చూశారని, ఆఖరికి ఆ కంపెనీని తొలగించారని గుర్తుచేశారు. అందుకే ముచ్చర్లలో కాలుష్య పరిశ్రమలు పెట్టొద్దని నిర్ణయించామని, అక్కడ 4 వేల ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ తరహాలో ఫార్మా హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

కేటీఆర్‌కు సున్నా ఇంటెలిజెన్స్.. 

ఆధునిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోందని, దీన్ని అన్నిరంగాలకు  అనుసంధానం చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దాదాపు 200 ఎకరాల్లో ఏఐ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థలను అక్కడికి తీసుకొస్తామని చెప్పారు. మేము ఏఐ గురించే చర్చించేటప్పుడు కేటీఆర్ విషయం చర్చకు వచ్చింది. దానికి ఒకరు సమాధానమిస్తూ కేటీఆర్‌కు 100 శాతం ఆర్టిఫిషియల్.. సున్నా ఇంటెలిజెన్స్’ అని సెటైర్ వేశారు. 

చీల్చి చెండాడుతా అంటే.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చిన

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్న మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా సీఎం రేవంత్ సెటైర్లు వేశారు. ‘కేసీఆర్ చీల్చి చెండాడుతా అంటే.. నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చిన. కేటీఆర్ తన ప్రసంగంలో రాజకీయ విమర్శలు చేయడం తప్ప ఏమైనా సూచనలు చేశారా? బీఆర్‌ఎస్ నాయకులు ఇలా చేస్తే ప్రజలు ప్రతిపక్షంలో కూడా ఉండనీయరు’ అని అన్నారు. 

సిరిసిల్ల కార్మికులతోనే బతుకమ్మ చీరలు నేయించారా?

కాంగ్రెస్ పాలనలో నేత కార్మికులు ఆత్మహత్యలు పెరిగిపోయాయన్న కేటీఆర్ విమర్శలను సీఎం తిప్పికొట్టారు. 2017 బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టిన ఏడాదిలో బీఆర్‌ఎస్ సర్కారు సిరిసిల్ల నేత కార్మికులతో అన్ని బతుకమ్మ చీరలు నేయించిందా? అని ప్రశ్నించారు. సూరత్‌లో కిలోల కొద్ది చీరలు కొని తెచ్చి.. తెలంగాణ ఆడ బిడ్డలకు పంచలేదా? అని నిలదీశారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్‌ను బినామీలకు అప్పగించారని సీఎం విమర్శించారు. బతుకమ్మ చీరల్లో అవినీతి జరిగిందని ఆరోపిం చారు. నాడు పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను మహిళలు తిరస్కరించింది నిజం కాదా? అని నిలదీశారు. అందుకు కేటీఆర్ స్పందిస్తూ మొదటి ఏడాది చీరలు నేసే సమయం లేకపోవడంతో టెండర్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించినట్లు తెలిపారు.  

నేడు స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన

ముచ్చర్ల భూముల్లో స్కిల్ యూనివర్సిటీకి గురువారం శంకుస్థాపన చేస్తున్నామని, ప్రతిపక్ష నాయకులు కూడా రావాలని సీఎం రేవంత్ కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ౫౭ ఎకరాల్లో స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  ముచ్చర్లలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మి స్తామని తెలిపారు. అందుకోసం ఇప్పటికే బీసీసీఐతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు ప్రభుత్వం గ్రూప్-1స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు చెప్పారు.

వైద్య సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు ముచ్చర్లలోనే వెయ్యి ఎకరాల్లో హెల్త్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం సేకరించిన 20 వేల ఎకరాల భూమిని ఇతర అవసరాల కోసం వినియోగడం వల్ల లీగల్ సమస్యలు వస్తాయన్న కేటీఆర్ ప్రకటనపై సీఎం వివరణ ఇచ్చారు. ‘ఫార్మాసిటీతోపాటు అనుబంధ సంస్థల కోసం భూసేకరణ చేస్తున్నట్లు నాడు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఆజామాబాద్ పారిశ్రామికవాడలో పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం నాడు ప్రభుత్వం భూములను ఇచ్చింది.

బీఆర్‌ఎస్ సర్కారు వాటిని నివాస ప్రాంతాల కిందికి మార్చేందుకు కొత్త పాలసీని తీసుకురాలేదా?’ అని ప్రశ్నించారు. సామాన్య ప్రజల రవాణా కోసం ఏడేళ్ల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్‌ను అనుసంధానం చేసేందుకు అనుమతించాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరితే బీఆర్‌ఎస్ సర్కారు ఒప్పుకోలేదని విమర్శించారు. కేవలం రెండున్న కిలోమీటర్లు ఎంఎంటీఎస్ లైన్‌ను ఏర్పాటు చేస్తే ఎయిర్‌పోర్టుకు అనుసంధానం అవుతుందని.. అయినా అందుకు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకోలేదని ఆరోపించారు. ఆర్థిక, రాజకీయ కారణాలతోనే నాడు ప్రభుత్వం అనుమతివ్వలేనది, ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలియాలని స్ఫష్టం చేశారు.