సనా మక్బూల్.. 2014లో వచ్చిన ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో సమీత పాత్రతో తెరంగేట్రం చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత 2017లోనూ ‘మామ ఓ చందమామ’లోనూ బుజ్జమ్మ పాత్రలో నటించిందీ ఈ ముంబై ముద్దుగుమ్మ. మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించి టెలివిజన్ నటిగా పలు షోలలో పాల్గొంటూ, సీరియళ్లలో నటిస్తూ సినిమాల వైపు అడుగులు వేసింది. ఇటీవల హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచింది. జూన్ 21న ప్రారంభమైన మూడో సీజన్ శనివారంతో పూర్తయింది. నేజీతో నెలకొన్న తీవ్ర పోటీలో చివరకు సనాను విజేతగా ప్రకటించారు ప్రముఖ నటుడు అనిల్ కపూర్. ఆయన బిగ్‌బాస్ సీజన్ హోస్ట్‌గా వ్యవహరించారు. సినిమాల్లో అవకాశాలు రాక, టీవీ కార్యక్రమాల్లో బిజీ అయిన సనా.. తాజాగా బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి రూ.25 లక్షల నగదు బహుమానాన్ని దక్కించుకుంది. మరి నటిగా కోట్లాది ప్రేక్షకుల మనసు గెలుచుకునే ప్రయత్నంలో ఈ విజయం సనా మక్బూల్ కెరీర్‌ను ఏమైనా మలుపు తిప్పుతుందా? వేచిచూడాలి. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన ఈ వేళ మస్త్ మస్త్ జోష్‌లో ఉన్న ఈ ముంబై మురబ్బాకు ముబారక్!