ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి తన పాటలతో భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఆమె 108వ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నివాళి అర్పించారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. దీంతో ఆ లెజెండరీ సింగర్ బయోపిక్ మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే తనకెంతో ఇష్టమని విద్యాబాలన్ ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించింది. ఇప్పుడు మరోమారు ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దిగ్గజ గాయని పాత్రలో నటించాలనే తన కోరిక మరోసారి బయటపెట్టారు. ‘నా చిన్నప్పట్నుంచి ఇప్పటివరకు ఉదయం నిద్ర లేవగానే వినిపించే శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో సుబ్బులక్ష్మి గారి గొంతే వినిపిస్తుంది.
ఆమె ఓ ఆధ్యాత్మిక శక్తి. ఆమెకు ఇలా నివాళి అర్పించడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని విద్యాబాలన్ పేర్కొంది. విద్యాబాలన్ చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు స్పందిస్తూ ఆమె బయోపిక్ గురించి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి సుబ్బులక్ష్మి బయోపిక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆమె బయోపిక్‌లో విద్యాబాలన్ నటించనున్నట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత కీర్తి సురేశ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ‘మహానటి’ సినిమా తర్వాత కీర్తి సురేశ్తోనే ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ అంటూ వార్తలు ప్రచురితమయ్యాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.