24-03-2025 12:45:27 AM
విజయ్ దేవరకొండతో సరసన ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత మృణాల్ ఠాకూర్ తెలుగులో మరో సినిమా చేయలేదు. దీంతో కొన్నాళ్లుగా హిందీలో ఆఫర్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ దక్షిణాదిన మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో శింబు సరసన మృణాల్ నటించనున్నట్టు తెలుస్తోంది. శింబు చేతిలో ప్రస్తుతం సుమారు 3 సినిమాలున్నాయి. శింబు కథానాయకుడిగా నటిస్తున్న ‘ఎస్‌టీఆర్49’కు రాజ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తుండగా, డైరెక్టర్ దేసింగు పెరియసామితో కలిసి ‘ఎస్‌టీఆర్50’ చేస్తున్నాడు శింబు. మరోవైపు ‘ఎస్‌టీఆర్51’ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
వీటిల్లో డైరెక్టర్ రాజ్‌కుమార్ బాలకృష్ణన్ కలిసి చేస్తున్న చిత్రంలో శింబు సరసన మృణాల్ కనిపించనుందని తాజాగా కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఇందులో సంతానం, సాయిపల్లవి, సిలంబరసన్ భాగమవుతున్నట్టు ఇప్పటికే కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మృణాల్ ఠాగూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వినవస్తోంది. ‘థగ్‌లైఫ్’ సినిమా తర్వాత శింబు 49వ మూవీ షూటింగ్ దుబాయ్‌లో ఉంటుందని అంటున్నారు.