calender_icon.png 6 October, 2024 | 9:47 AM

చెన్నూర్‌లో ‘ఎంఆర్‌ఆర్’ టాక్స్!

06-10-2024 12:27:40 AM

వైన్‌షాపులు, దాబాల నుంచి నెల మామూళ్లు

చెల్లించుకోకుంటే అధికారుల దాడులు.. కేసులే

మంచిర్యాల, అక్టోబర్ 5 (విజయక్రాంతి) : రోడ్ టాక్స్, హౌజ్ టాక్స్ తదితర టాక్స్‌లు కడుతున్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ వాసులు అదనంగా ‘ఎంఆర్‌ఆర్’ టాక్స్ కడుతున్నారు. టాక్స్ కడితే అంతా ఓకే.. లేదంటే అధికారుల దాడులు, కేసులే.

ఇటీవల శనిగకుంట మత్తడి ధ్వంసం కేసులో కొందరిని కాపాడారనే విషయం ప్రస్తావించిన సమయంలో ఎంఆర్‌ఆర్ ట్యాక్స్ కూడా చర్చనీ యాంశం అయ్యింది. చెన్నూర్‌లోని వైన్‌షాపులు, బెల్ట్ షాపులు, దాబాలు, అక్రమ ఇసుక క్వారీలు, పీడీఎస్ బియ్యం రవాణా చేసేవారు, నల్ల బెల్లం సరఫరా చేసే వారు, మార్వాడీ సేట్లు నెల నెలా ‘ఎంఆర్‌ఆర్’ టాక్స్ కట్టాల్సిందేనని హుకూం జారీ చేశారు.

కోటపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి (ఆయన వర్గానికి చెందిన దగ్గరి వ్యక్తి) ఇతని పేరు చెప్పుకొని జోరుగా కలప అక్రమ రవా ణా చేస్తున్నట్టు సమాచారం. కోటపల్లి మండలంలోని వెల్మపల్లి, లక్ష్మీపూర్, రాపన్‌పల్లిలో గతంలో బీఆర్ ఎస్ లీడర్లు దాబాలు, బెల్ట్ షాపులు నిర్వహించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటని మూయించి నెలకు కొంత చెల్లించేలా బేరం కుదుర్చుకొన్నాక తిరిగి తెరిపించారు.

గతంలో కొల్లూరులో ఇసుక అక్రమ రవాణా చేసిన ఓ వ్యక్తిని లక్షలు డిమాండ్ చేశారు. అతడు నిరాకరించడంతో అతని లారీలను పోలీసులకు, మైనింగ్ అధికారులకు పట్టించి బెదిరింపులకు పాల్పడ్డారు. కొత్త వైన్‌షాపులు వచ్చిన వారి నుంచి ఒక్కొక్కరి రూ.౨ లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.

అ(న)ధికారికంగా పేకాట క్లబ్బులు 

చెన్నూర్ నుంచి కోటపల్లికి వెళ్లే దారిలో అధికారికంగానే పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఓ నేత ఫంక్షన్‌హాల్‌తో పాటు ఇదే దారిలో ఉండే ఒక కాటన్ జిన్నింగ్ మిల్లులో పేకాట నిర్వహిస్తున్నట్టు స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

ఇటీవల ఒక క్లబ్‌కు హైదరా బాద్ నుంచి వచ్చిన ఓ ఆటగాడు తమను మోసం చేసి గెలుస్తున్నారం టూ వారిపై దాడి చేసి పంపించిన ఘటన కలకలం రేపింది. పేకాట ఆడిస్తూ నిత్యం రూ.లక్షల్లో సంపాదిస్తున్నారని సమాచారం. నడిపిస్తున్నది బడా నేతలు కావడంతో పోలీసులు కూడా ‘మామూలు’గా తీసుకుంటున్నట్టు తెలిసింది.