calender_icon.png 3 October, 2024 | 8:53 PM

ఎంపీ వద్దిరాజు మున్నేరు ముంపు బాధితులకు చేయూత

03-09-2024 04:12:40 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో ఇండ్లలోకి వరద పోటెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఎంపీ రవిచంద్ర ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం హూటాహుటిన ఖమ్మం చేరుకున్న విషయం తెలిసిందే.. ఎంపీ వద్దిరాజు వెంటనే రంగంలోకి దిగి వరద ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు, పుట్టెడు దుఃఖంతో ఉన్న వారిని ఓదార్చారు,తానున్నానని భరోసానిచ్చారు. సోమవారం సాయంత్రం ఆయన బాధితుల ఇండ్లకు బీఆర్ఎస్ శ్రేణుల ద్వారా నిత్యావసరాలను అందించారు. 

ఇందుకు కొనసాగింపుగా ఎంపీ రవిచంద్ర మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున నిత్యావసరాలను మున్నేరు ముంపునకు గురైన ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు  ప్రాంతాలకు పంపించారు. ఎంపీ వద్దిరాజు మంగళవారం ఉదయం ఖమ్మం బురహాన్ పురంలోని తన నివాసం వద్ద నిత్యావసరాల సంచులతో నిండిన వాహనాలను ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ జేడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్,మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం,బెల్లం వేణు, తోట వీరభద్రం,గుండ్లపల్లి శేషగిరిరావు తదితర ప్రముఖులు,తన అభిమాన గణంతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి నిత్యావసర సరుకులతో కూడిన వాహనాలు కాల్వొడ్డు,బొక్కలగడ్డ,గణేష్ నగర్,వెంకటేశ్వర నగర్,సారథి నగర్, రాజీవ్ గృహకల్ప, వికలాంగుల కాలనీ తదితర చోట్లకు చేరుకున్నాయి.