- ప్రముఖ గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌తో వివాహం
- మార్చి 24న ఒక్కటి కాబోతున్న జంట
న్యూఢిల్లీ, జనవరి 1: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన ఆయన చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను మార్చి 24న వివాహం చోసుకోబోతున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా సూర్యనే ప్రకటించారు. సూర్య న్యాయవిద్యను అభ్యసించిన అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. సెప్టెంబర్, 2020 వరకు ఆయన భారతీయ జనతా యువ మోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. దేశంలోని అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో సూర్య కూడా ఒకరు.
గతంలో శివశ్రీకి మోదీ ప్రశంసలు
తేజస్వీ సూర్య వివాహం చేసుకోబోతున్న శివశ్రీ స్కంద ప్రసాద్‌పై ప్రధాని నరేంద్రమోదీ గతంలో ప్రశంసలు కురిపించారు. ఓ కన్నడ దైవభక్తి గీతాన్ని రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో ఆ వీడియో ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమెపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. దీంతో ఆమె రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు.
తంజావూరులోని సస్త్రా యూనివర్సిటీలో బయోఇంజినీరింగ్‌లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. చెన్నై యూనిర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ పట్టా పొందారు. అలాగే మద్రాస్ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ చేశారు. చెన్నై సహా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో ఆమె తన గాత్రంతో ప్రజల మనసు గెలుచుకున్నారు.