* పోటాపోటీ నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్ ప్రాంగణం
* తోపులాటలో పలువురు ఎంపీలకు గాయాలు
* ఇండియా కూటమి ఎంపీలు కావాలనే చేశారంటున్న ఎన్డీయే
* ఆసుపత్రిలో చేరిన ఎన్డీయే ఎంపీలు
* ఫోన్‌లో పరామర్శించిన ప్రధాని మోదీ
* తన కాలుకూ గాయమైందన్న ఖర్గే
* పోలీసులకు ఎన్డీయే ఫిర్యాదు
* రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు
* అమిత్‌షాను కాపాడే ప్రయత్నం: ఇండియా కూటమి
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: అంబేద్కర్ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం దద్దరిల్లింది. ఓ పక్క ఇండియా కూటమి ఎంపీలు, మరో పక్క ఎన్డీయే ఎంపీలు పోటాపోటీ నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తోపులాట చోటుచేసుకోగా.. తోపులాటలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఫైర్ అయిన ఎన్డీయే పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కావాలనే, ఉద్దేశపూర్వకంగా ఎంపీలను తోసేశాడని వారు వాదిస్తున్నారు.
దీంతో పోలీసులు రాహుల్ గాంధీ మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మరో పక్క ఈ తోపులాటలో నా కాలుకు కూడా గాయం అయిందని రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. అంబేద్కర్ మీద కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి ఆయన్ను కాపాడేందుకు బీజేపీ ఇలా నాటకాలు ఆడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీలను ప్రధాని మోదీ ఫోన్లో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
గురువారం పార్లమెంట్ ప్రాంగణం యుద్ధభూమిని తలపించింది. రోజటి లాగానే ప్రతిపక్ష ఎంపీలతో పాటు అధికార పక్ష ఎంపీలు కూడా శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలపై గత రెండు రోజులుగా ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. గురువారం కూడా ఇదే ఆంశంపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు సిద్ధం అయ్యారు. ప్లకార్డులు చేతపట్టుకుని పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. అదే సమయంలో అధికార పక్ష ఎంపీలు కూడా కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తూ నిరసనకు దిగారు. ఇలా రెండు వర్గాల ఎంపీలు పోటాపోటీగా నిరసనలకు దిగడంతో పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తర్వాత కొద్ది సేపటికే ఇరు వర్గాల ఎంపీల మధ్య తోపులాట జరగ్గా.. బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోయడం వల్లే ఆ ఎంపీలు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. అది నిజం కాదని కాంగ్రెస్ వాదిస్తోంది. బీజేపీ ఎంపీలు ముఖేశ్ రాజ్‌పుత్, ప్రతాప్ చంద్ర సారంగి ఇద్దరూ ఈ తోపులాటలో కింద పడి గాయపడ్డారు.
రాహుల్ వల్లే గాయాలు..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వల్ల తోపులాట ఘటనలో బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయని ఎన్డీయే నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా రాహుల్ గాంధీ మీద పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు ఆయన మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ మీద ఫిర్యాదు చేశాం. ఏంజరిగిందో ఇప్పటికే ఎంపీలు చెప్పారు’ అని వెల్లడించారు. గాయపడ్డ సారంగి ఆసుపత్రికి వెళ్లే ముందు మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు. నేను మెట్ల మీద నిల్చొని ఉన్నా. అప్పుడే రాహుల్ గాంధీ వేరే ఎంపీని తోశారు. ఆయన వచ్చి నామీద పడిపోయారు.’ అని వెల్లడించారు.
అందుకే బీజేపీ ఆరోపణలు
బీజేపీ కాంగ్రెస్ మీద చేసిన ఆరోపణలను ఆ పార్టీ ఖండించింది. మహనీయుడు అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇటువంటి పనికిమాలిన ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘అంబేద్కర్‌పై షా వ్యాఖ్యలు చేశారు. అదానీ అవినీతికి పాల్పడ్డారని యూఎస్ సంస్థలు తేల్చాయి. అయినా ఈ అంశాల మీద కేంద్రం చర్చించడం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
పట్టించుకోని సిబ్బంది..
పార్లమెంట్ ప్రాంగణంలో చీమ చిటుక్కుమన్నా కానీ భద్రతా సిబ్బంది వెంటనే వాలిపోతారు. అటువంటిది గురువారం పార్లమెంట్ ఆవరణలో పరిస్థితులు రణరంగాన్ని తలపించాయి. అయినా కానీ భద్రతా సిబ్బంది మాత్రం అక్కడికి వచ్చినా ఎంపీలను వారించే ప్రయత్నం చేయలేదు. ఇదే అంశాన్ని చాలా మంది లేవనెత్తుతున్నారు. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోకపోవడం చిత్రంగా ఉందని అంటున్నారు. కాగా.. ఇదే అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ ఈ ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్ చేసింది.
నా కాలుకూ గాయమైంది: ఖర్గే
ఎంపీల తోపులాట ఘటనలో తన కాలుకు కూడా గాయమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఆయన ఇందుకు సంబంధించి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. ‘బీజేపీ ఎంపీలు నన్ను తోశారు. నా మోకాలికి గాయమైంది’ అని లేఖలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘బీజేపీ ఎంపీలు ప్లకార్డులతో పాటు లావు కర్రలతో మార్చ్ చేశారు. నన్ను కిందకు తోసి.. శాంతియుత నిరసనను రణరంగంగా మార్చారు’ అని ఫైర్ అయ్యారు.
గాయపడ్డ ఎంపీ వద్దకు రాహుల్..
తోపులాటలో కింద పడి గాయపడ్డ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి వద్దకు రాహుల్ గాంధీ వెళ్లారు. గాయపడ్డ ఎంపీ వద్దకు రాహుల్ వెళ్లిన వీడియోలను బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో షేర్ చేసి విమర్శలు గుప్పించుకున్నాయి.
నీలం రంగు టీషర్ట్‌తో రాహుల్
రాహుల్ గాంధీ నీలం రంగు టీషర్ట్ ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం రాహుల్ ఎక్కువగా తెలుపు రంగు టీషర్ట్‌నే ధరించారు. కానీ గురువారం మాత్రం ఆయన కొత్తగా నీలం రంగు టీషర్ట్ ధరించి సభకు వచ్చారు. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాక చాలా మంది ఇండియా కూటమి ఎంపీలు నీలం రంగు ధరించారు. నీలం రంగు అనేది దళితుల ఐక్యతకు చిహ్నం. ప్రస్తుతం సభలో అంబేద్కర్‌కు సంబంధించిన రగడ నడుస్తున్న తరుణంలో రాహుల్ గాంధీతో పాటు అనేక మంది ఇండియా కూటమి ఎంపీలు ఇలా నీలం రంగు ధరించి కనిపించారు. ‘నీలం రంగు అనేది అంబేద్కర్‌కు ఇష్టమైన రంగు. ఆయన జీవితంలో ఎక్కువగా వాడిన రంగు ఇదే’ అని అంబేద్కర్ మహాసభకు చెందిన లాల్‌జీ 2018లో పేర్కొన్నారు. అందుకోసమే రాహుల్ గాంధీ దళితుల ఐక్యతకు చిహ్నంగా నీలం రంగును ధరించినట్లు పలువురు పేర్కొంటున్నారు.
ఫోన్‌లో పరామర్శించిన ప్రధాని మోదీ
తోపులాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బీజేపీ ఎంపీలను ప్రధాని మోదీ ఫోన్ చేసి పరామర్శించారు. బీజేపీకి చెందిన ముఖేశ్ రాజ్‌పుత్, ప్రతాప్ సారంగి గాయపడి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఎంపీలు ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెడికల్ సూపరింటెండెంట్ అజయ్ శుక్లా మాట్లాడుతూ.. ‘ఇద్దరు ఎంపీలకు తలకు గాయాలయ్యాయి. ఇద్దరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. టెస్టులు చేశాం. ప్రతాప్ సారంగికి లోతైన గాయం అయి తీవ్ర రక్తస్రావం అయింది.అతడికి కుట్లు వేశాం. చికిత్స కొనసాగుతోంది. మరో ఎంపీ స్పృహ కోల్పోయే స్థితిలోకి వెళ్లగా... అవసరమైన వైద్యం అందించాం. ఆయన ప్రస్తుతం స్పృహలోకి వచ్చారు’ అని వెల్లడించారు.
రాహుల్ నాపై అరిచాడు
నాగాలాండ్‌కు చెందిన మహిళా ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్ రాహుల్ గాంధీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ వల్ల తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వెల్లడించారు. ఎంపీ మాట్లాడుతూ.. ‘ప్లకార్డు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో రాహుల్ నా దగ్గరకు వచ్చి నాపై అరిచారు. అనుచితంగా ప్రవర్తించారు. ఆయన ప్రవర్తన వల్ల ఎంతో అసౌకర్యానికి గురయ్యా’ అని ఎంపీ వివరించారు. సభ చైర్మన్‌కు ఆ ఎంపీ ఫిర్యాదు కూడా చేశారు.
గాయమైంది వీరికే..
ఎంపీల తోపులాటలో బీజేపీకి చెందిన ముఖేశ్ రాజ్‌పుత్ గాయపడిన విషయం తెలిసిందే. 56 ఏండ్ల ముఖేశ్ యూపీలోని ఫరూఖ్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఫరూఖాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ముఖేశ్ హ్యాట్రిక్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2014 నుంచి అక్కడ ఆయనే గెలుస్తూ వస్తున్నారు. తలకు గాయమై ప్రస్తుతం ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను కేంద్ర మంత్రులు పరామర్శించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అంతే కాక ప్రతాప్ చంద్ర సారంగి అనే ప్రతాప్ చంద్ర సారంగి అనే మరో బీజేపీ ఎంపీ కూడా ఈ తోపులాటలో గాయపడ్డారు. ఈయన ఒడిషాలోని బాలాసోర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు 2019, 2024లో జరిగిన ఎన్నికల్లో ఈయన బీజేపీ ఎంపీగా గెలిచారు. ఈయనకు కూడా తలకు గాయం కాగా.. ప్రస్తుతం కోలుకుంటున్నారు. కేంద్ర మంత్రులు ప్రతాప్‌ను పరామర్శించగా.. ప్రధాని మోదీ ఫోన్లో ధైర్యం చెప్పారు. ప్రతాప్ చంద్ర మీద అనేక కేసులు ఉన్నాయి. సారంగి ప్రస్తుతం మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో పాటుగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యుడిగా కూడా కొనసాగారు.