23-02-2025 12:21:22 AM
బీసీ కాలేజీ హాస్టళ్లలో మెస్, అద్దె, కరెంటు బిల్లులు చెల్లించండి
డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎంపీ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి
హైదరాబాద్,(విజయక్రాంతి): బీసీ కాలేజీల హాస్టళ్ల మెస్ బిల్లులు, ఇంటి అద్దె బిల్లులు, కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థుల చదువులు సంక్షోభంలో పడ్డాయని... ఆ దుస్థితి లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం నాడు ఆయన డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందించారు. బీసీ కాలేజీల హాస్టల్స్‌లో 5 నెలలుగా మెస్ ఛార్జీలు, 3 సంవత్సరాలుగా అద్దె బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఉప్పు, పప్పు, కూరగాయలు, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు అప్పుల పాలయ్యారని ఫలితంగా వారు వస్తువుల సరఫరా ఆపేసే దుస్థితి వచ్చిందన్నారు. కరెంటు కట్ చేస్తే విద్యార్థులు చదువుకునేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి వస్తుందన్నారు. సరైన సదుపాయాలు లేకుంటే ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టేందుకు సహకరించాలని ఆయన ఉప ముఖ్యమంత్రిని కోరారు.