06-02-2025 03:11:36 PM
పారిశ్రామిక వాడలో మత్స్యకారుల్ని ప్రత్యేకంగా పరిగణించండి
ప్రతి ఒక్కరికీ సొసైటీ సభ్యత్వాలు కల్పించండి
సొసైటీ సభ్యత్వాలు లేక పథకాల లబ్ధి కోల్పోతున్న మత్స్యకారులు
సంగారెడ్డి,(విజయక్రాంతి): పాశమైలారం పరిశ్రమల కాలుష్యం(Pashamylaram Industries Pollution ) వల్ల ఇస్నాపూర్ చెరువులు విషపూరితంగా మారడంతో మత్స్యకారులకు జీవనోపాధి సమస్య వస్తుందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దృష్టికి కాంగ్రెస్ ఎంపీ నీలం మధు ముదిరాజ్(MP Neelam Madhu Mudiraj) తీసుకుపోయారు. గురువారం హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు వినతిపత్రం ఇచ్చి సమస్యలు వివరించారు. సానుకూలంగా స్పందించి, విచారణ జరిపి నివేదిక ఇవ్వవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారని నీలం మధు తెలిపారు. జిన్నారం మండలం కొడకంచి ఆదినారాయణ స్వామి జాతర, ఇస్నాపూర్ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు రావాలని ఆహ్వానం అందజేశారు. పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఇస్నాపూర్ గ్రామ మత్స్యకారులను ప్రత్యేకంగా ఉపాధి కల్పించాలన్నారు.
ఈనెల 8వ తేదీన జిన్నారం మండలం కోడకంచి ఆదినారాయణ స్వామి జాతర , ఈనెల 21వ తేదీన ఇస్నాపూర్ పెద్దమ్మతల్లి విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. పాశమైలారం పారిశ్రామిక వాడలో వెలువడుతున్న కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలో చెరువులు విషపూరితంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్ధ జలాలు చెరువులో కలవడం వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలా చెరువులలో చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయన్నారు. ఏ ఏ పరిశ్రమల ద్వారా చెరువులకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా విచారణ జరిపి నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని చెరువుల్లో కాలుష్యం వల్ల చేపల పెంపకానికి అనువుగా లేకపోవడంతో ఇక్కడ మత్స్యకార సభ్యులకు సొసైటీలో సభ్యత్వం కల్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వాపోయారు. దీంతో ఇక్కడ మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలలో అర్హత సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాశమైలారం పారిశ్రామికవాడలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇస్నాపూర్ మత్స్యకారులను ప్రత్యేకంగా గుర్తించి జిల్లా మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని మరియు పరిశ్రమల నుంచి ప్రతి సంవత్సరం నష్ట పరిహారం ఇప్పించాలని ఆయన మంత్రిని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన మంత్రి కొండా సురేఖ సంబంధిత విజ్ఞప్తి పత్రంపై వెంటనే సంతకం చేసి పీసీబీ అధికారులకు విచారణ జరిపి నివేదిక ఇవ్వవలసిందిగా ఆదేశాలిచ్చారు, పారిశ్రామిక వాడలోనీ మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాసరి శ్రీకాంత్ రెడ్డి, జిన్నారం, గుమ్మడిదల మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, నర్సింగ్ రావు, ప్రతాప్ రెడ్డి,మాణిక్ రావు, నారబోయిన శ్రీనివాస్, వీర్నాల సత్యనారాయణ, సుంకర బోయిన మహేష్,కొడకంచి ఆలయ అర్చకులు, ఇస్నాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మన్నే రాఘవేందర్,ఉళ్ళ శంకర్, ప్యాట నర్సింలు,యాదగిరి, పెంటయ్య, గోపాల్,రాజు, సోములు, మనోహర్, దశరథ్,రవి తదితరులు పాల్గొన్నారు.