హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయి. ఒకప్పుడు మిత్రులుగా ఉన్న నేతలు ఇప్పుడు ఒకరి పార్టీపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)పై ఏంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు చేయలేదా?, మూసీపై బీఆర్ఎస్ ప్రణాళిక వద్దని నేను చెప్పలేదా?.. అప్పటి విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ జాతకాలు తమ దగ్గర ఉన్నాయని, తాను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడతారని హెచ్చరించారు. ఇళ్లు కదల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని అసదుద్దీన్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలని కోరారు. ఎంఐఎం వల్లే బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి. ఎంఐఎం మద్దతు వల్లే బీఆర్ఎస్ కు జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ సీట్లు వచ్చాయని స్పష్టం చేశారు. 24 మందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేది.. అప్పడు బీఆర్ఎస్ వాళ్లకు అహంకారం ఉందని తెలిపారు.