06-04-2025 10:27:08 PM
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు..
న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్..
చర్ల (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం బహిరంగంగా ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు. ఆదివారం చర్ల పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ... అక్రమ అరెస్టులను ఖండించండని ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు మేధావులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామ కళ్యాణానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా సమస్యలు విన్నవించుకోవడమే తాము చేసిన తప్పా, కగార్ ఆపరేషన్ పేరుతో అమాయక ఆదివాసి గిరిజనులను ఎందుకు చంపుతున్నారని ప్రశ్నించడం నేరమా అని అన్నారు. జల సూత్రాలకు వ్యతిరేకంగా సీతారామ ప్రాజెక్టు నీళ్లను బయట ప్రాంతాలకు తరలించవద్దని, ఏజెన్సీలో పోడుభూములు కొట్టుకొని సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, చదువుకొని నిరుద్యోగంగా ఉన్న ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలని, ఏడవ గ్యారెంటీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలన్నారు.