calender_icon.png 22 September, 2024 | 4:37 AM

భువనగిరి ఖిల్లాపై రోప్‌వే ప్రాజెక్టులో కదలిక

20-09-2024 12:10:46 AM

ఖిల్లాను సందర్శించిన టూరిజం, ఎల్‌అండ్‌టీ అధికారులు

యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు 19 (విజయక్రాంతి): ఆసియాలోనే అతి ఎత్తున ఏకశిలా దుర్గం భువనగిరి ఖిల్లాను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనల్లో మళ్లీ కదలికలు వచ్చాయి. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్శించడానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గత పదిహేనేళ్లుగా ప్రణాళికల రూపకల్పనలు ప్రతిపాదనల స్థాయిలోనే కొట్టుమిట్టా డుతూ వస్తున్నాయి. భువనగిరి ఖిల్లా పర్యాటకాభివృద్ధిలో అత్యంత కీలకమైనది  సందర్శకులను చేరవేయడానికి రోప్‌వే ప్రతిపాదన. ఈ ప్రతిపాదనలు సినీ నటుడు చిరంజీవి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా మారా యి.

అయితే, తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  హైదరాబాద్ నగర పరిసరాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే యోచనలో భాగంగా భువనగిరి ఖిల్లా వద్ద అభివృద్ధి పనుల్లో మళ్లీ కదలికలు వచ్చాయి. దీనిలో భాగంగా రోప్‌వే పనులు చేపట్టడానికి ఉన్న అడ్డంకులను అధిగమించడానికి ప్రాథమిక స్థాయిలో చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ ప్రకాశ్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ ప్రాజెక్టు పీడీఎం సుమతితో పాటు రెండు శాఖల ఉన్నతాధికారులు, రోప్‌వే టెక్నికల్ టీం ఖిం పరిసరాలను సందర్శించింది.

ముఖ్యంగా రోప్‌వే ప్రతిపాదిత స్థల సేకరణ అంశాలను పరిశీలించడమే కాకుం డా అలైన్‌మెంట్‌లో మార్పుల కోసం అక్కడి రైతులతో సంప్రదింపులు జరిపారు. అలైన్‌మెంట్ సర్వే జరిపి, ఆ లైన్ ప్రకారం రైతులను సంప్రదించి, వారికి తగిన పరిహారం అందించి భూ సేకరణ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు టూరిజం శాఖ ఎండీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. రోప్‌వే ప్రాజెక్టు ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్ హనుమంతు కే జండగే, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారితో చర్చించారు. ఈ నివేదికపై కలెక్టర్ సానుకూలంగా స్పందించ డంతో డీపీఆర్‌ను  కేంద్ర ప్రభుత్వానికి నివేదించి తగిన అనుమతులతో  నిర్మాణం పనులను వెంటనే చేపడతామని ఆయన పేర్కొన్నారు.