calender_icon.png 16 January, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంచాలిస్తేనే ఫైల్స్‌లో కదలిక

17-09-2024 04:24:17 AM

  1. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు 
  2. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోయిందంటూ అసహనం

పుణె (మహారాష్ట్ర), సెప్టెంబర్ 16: తన ముక్కుసూటి ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ప్రభుత్వ శాఖల్లో పెరిగిపోయిన అవినీతిని ఎత్తిచూపారు. ఆదివారం ఇంజినీర్స్ డే సందర్భంగా పుణేలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థులు నిర్వహించన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ ప్రభుత్వ శాఖలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పెచ్చుమీరిపోయింది. వివిధ శాఖల్లో ఫైల్స్ వాటిపై పెట్టే డబ్బును బట్టి కదులుతున్నాయి. లంచం లేనిదే వ్యవస్థలో ఏ పనీ కావడం లేదు’ అని స్పష్టం చేశారు. అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, సమయానుకూల నిర్ణయాలు అవసరమని ఆయన చెప్పారు. 

గుంతలు పూడ్చేందుకు కూడా ఆదేశాలు కావాలా?

ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థులను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. ‘భారత దేశ వ్యవస్థలో బ్యూరో క్రాట్లు(కలెక్టర్లు) ఎలా తయారయ్యారంటే.. హైవేలపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాటి కి కారణం రోడ్లపైన గుంతలు అని తెలిసినప్పటికీ వాటిని పూడ్చేందుకు ఆదేశాలు కోసం వేచి చూస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. ఒక బ్యూరోక్రాట్ అయి ఉండి గుంతలు పూడ్చేందుకు కూడా ఇతరుల ఆదేశాలపై ఆధారపడటం సిగ్గుచేటని అన్నారు. నేను ఏ విషయాన్నైనా సూటిగా మాట్లాడుతాను. ఇకనుంచైనా బ్యూరోక్రాట్లు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నా ను అని గడ్కరీ స్పష్టం చేశారు.