calender_icon.png 24 October, 2024 | 11:53 AM

42% రిజర్వేషన్లకు ఉద్యమం

22-07-2024 02:54:00 AM

తెలంగాణ బీసీ సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ 

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన మాటప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని తెలంగాణ బీసీ సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఏ పార్టీ అధికారం చేపట్టినా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోసపూరిత హామీలిస్తూ గద్దెనెక్కిన తరువాత.. ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

త్వరలో జిల్లాలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని, రేవంత్ సర్కార్ నిరుద్యోగుల సమస్యలు గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల బలంతో గెలిచిన కాంగ్రెస్, ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తోందని నిలదీశారు. అదే విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా పాత విధానంతో ఎన్నికలకు వెళ్లితే సహించేదిలేదని, రిజర్వేషన్లు పెంచిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. రుణమాఫీ పూర్తయ్యాక, స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోందని, బీసీలకు అన్యాయం చేసే పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.