- మజీద్‌పూర్ సీలింగ్ భూములను పరిశీలించిన ఆర్డీవో అనంతరెడ్డి
- బాధితులకు న్యాయం చేస్తామని హామీ
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 31: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్‌పూర్ సీలింగ్ భూములను శనివారం ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి పరిశీలించారు. బాధితులు తెలిపిన వివరాలు.. మజీద్‌పూర్ గ్రామంలో 1993లో అప్పటి ప్రభుత్వం 243 ఎకరాలు సీలింగ్ భూమిని 143 మంది నిరుపేద రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చింది. అయితే వాటికి నేటికీ పట్టాదారులకు పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. కొంత మంది అధికారులు అక్రమార్కలతో కుమ్మ క్కై సర్వే నంబర్ 161, 162, 163, 164లో 17 మందికి చెందిన 18 ఎకరాలు సీలింగ్ భూమి ఈ మధ్య వేరే వారికి రిజిస్ట్రేషన్ చేశారు. అది క్యాన్సిల్ చేయడానికి గతంలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్, ఇబ్రహీంపట్నం ఆర్డీవోలకు వినతిపత్రం ఇచ్చామని బాధితులు ఆర్డీవో అనంతరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
అదే విధంగా గతంలో రైతులకు ఇచ్చిన సర్టిఫికెట్లను చూపించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. భూ బాధిత రైతులందరికీ న్యాయం చేస్తామని హామీనిచ్చారు. తదుపరి విచారణకు తర్వలోనే మిమ్మల్ని పిలుస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి నరసింహగౌడ్, శ్రీశైలం గౌడ్, మల్లేష్, కావలి సాయికుమార్, గోపాగోని బాలయ్య, కావా లి నర్సింహ, ఎడ్ల రమేష్, బొడిగే నారాయణ, గోపాగోని సుదర్శన్ తదితరులు ఉన్నారు.
సీలింగ్ భూమి పూర్తి సమాచారం..
1973 సీలింగ్ భూ సంస్కరణల చట్టం ప్రకారం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకినాడ ట్రిబున్యల్ ఆర్డర్ ప్రకారం 243.31 ఎకరాలను 1993లో అప్పటి ప్రభుత్వం గ్రామానికి చెందిన 143 మంది నిరుపేద రైతులకు కేటాయించి సర్టిఫికెట్లు ఇచ్చింది. సర్వే నెంబర్ ప్రకారం పొజిషన్ ఇచ్చారు. అయితే హద్దులు కేటాయించలేదు. నేటికి పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయలేదు.