calender_icon.png 18 January, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కదిలినయ్.. జగన్నాథ రథ చక్రాల్!

08-07-2024 12:41:40 AM

సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి చేరిక

  1. పూరీలో అంగరంగ వైభవంగా జగన్నాథుని రథోత్సవం 
  2. 53 ఏళ్ల తర్వాత ఒకేసారి నవ యవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర

లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం.. రాష్ట్రపతి హాజరు 

రథయాత్రలో అపశ్రుతి.. ఒకరు మృతి..400 మందికి గాయాలు

భువనేశ్వర్, జూలై 7: జగమేలు దేవుడు జగన్నాథుడు శ్రీక్షేత్రంలోని రత్న సింహాసనాన్ని వీడి సోదరుడు బలభద్రు డు, సోదరి సుభద్ర సమేతుడై  రథయాత్ర గా బయలుదేరాడు. తాను నందిఘోష్ రథంపై, బలభద్రుడు తాళధ్వజ, సుభద్ర దర్పళన్ వాహనంపై కొలువుదీరి.. లక్షలా ది మంది భక్తుల ‘జై జగన్నాథ్’ నామస్మరణ, వేదపండితుల మంత్ర ఘోష, మ ంగళవాద్యాల నడుమ పెంచిన తల్లి గుం డిచా దేవి మందిరానికి విచ్చేశాడు. మూ డు కిలోమీటర్ల మేర జరిగిన ఈ రథయా త్ర అంగ రంగ వైభవంగా సాగింది.

ఈ అద్భుత ఘట్టం ఆదివారం తెల్లవారుజామున ఒడిశాలోని పూరీ నగరంలో ఆవిష్కృతమైంది. తొలుత అర్చకులు జగన్నాథుడిని నవ యవ్వన రూపంలో అలంకరించారు. మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాల వల్లభ సేవ, నేత్రోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ చెరాపహరా సేవలో భాగంగా రథాల ముందు చీపురుతో ఊడ్చారు. 1971 తర్వాత ఒకేసారి జగన్నాథుడి నవ యవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహించడం ఇదే తొలిసారి. సాధారణంగా ఈ ఉత్సవాన్ని ఒకేరోజు నిర్వహిస్తారు. ఈసారి రెండు రోజులు నిర్వహిస్తుండటం విశేషం. దీనిలో భాగంగా సోమవారమూ ఉత్సవాలు కొనసాగనున్నాయి.

మూడంచెల భద్రతా వ్యవస్థ..

వీఐపీల తాకిడి కారణంగా అక్కడి పోలీస్‌శాఖ పూరీలో మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసింది. రెండు రోజులు కలిపి సుమారు 15 లక్షల మంది భక్తులు పూరీకి విచ్చేస్తారని అధికారులు అంచనా వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మొత్తం 180 ప్లటూన్ల భద్రతా బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. క్రౌడ్ మేనేజ్‌మెంట్,  ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పోలీసులు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పూరీ కలెక్టర్ సిద్దార్థ్ శంకర్ స్వైన్, ఎస్పీ పినాక్ మిశ్రా పర్యవేక్షిస్తున్నారు.

రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి

జగన్నాథుని రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథం లాగేందుకు భక్తులు వేలాదిగా పోటీపడటంతో తొక్కిసలాట జరిగింది. ఓ భక్తుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సుమారు 400 మంది గాయాలపాలయ్యారు. 

ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

విశ్వ ప్రసిద్ధిగాంచిన పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభోత్స వం సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ భక్తులకు ‘ఎక్స్’ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీస్సులు, కృప భక్తులపై ఉండాలని ఆకాంక్షించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు

లోగడ రాష్ట్రపతులెవరూ పూరీ జగన్నాథుడి రథోత్సవానికి హాజరు కాలేదు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్సవాలకు పూరీ విచ్చేశారు. ఆమె గవర్నర్ రఘుబర్ దాస్‌తో కలిసి సుభద్రాదేవి రథాన్ని లాగారు. ఉత్సవాలకు అతిథులుగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం ఉత్పవాలకు విచ్చేయడం విశేషం.