calender_icon.png 15 January, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో ముందుకెళ్లండి

13-09-2024 03:15:00 AM

  1. మహేశ్‌కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే సూచన 
  2. ఢిల్లీలో ఖర్గేను కలిసిన పీసీసీ చీఫ్ 
  3. క్యాబినెట్ విస్తరణపై సీఎం, ఏఐసీసీదే నిర్ణయం
  4. రాహుల్ ప్రధాని కావడమే మా లక్ష్యం 
  5. హైకోర్టు తీర్పుపై న్యాయ పోరాటం 
  6. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు
  7. కేటీఆర్‌కు నిరాశ తప్పదు 
  8. పాత కమిటీలే కొనసాగుతయ్
  9. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్  

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని మహేశ్‌కు ఖర్గే సూచించినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా తనను నియమించిన తరువాత మహేశ్‌కుమార్ గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్‌ను ఖర్గే అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

మంత్రివర్గంపై వారిదే నిర్ణయం..

ఖర్గేను కలిసిన అనంతరం మహేశ్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీకి వచ్చిన తాను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకుని పార్టీని బలోపేతం చేయాలని సూచించారని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ పెద్దలు మాట్లాడుతారని, ఈ విష యంలో వారే నిర్ణయం తీసుకుంటారని మీడి యా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

పాత కమిటీలన్నీ పనిచేస్తాయ్..

 కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాత కమిటీలన్ని పనిచేస్తాయని మహేశ్ కుమార్ స్పష్టం చేశారు. తాను పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మరోసారి ఢిల్లీకి వచ్చి కార్యవర్గ కూర్పుపై పార్టీ హైకమాండ్ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పార్టీ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని, సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మారిన ప్రతిసారీ కొత్త కమిటీలు ఏర్పాడుతాయని తెలిపారు.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయబోతుందని, కమిటీ సూచనలను అధ్యయనం చేసి ప్రజలకు ఆమోదయోగ్య మైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరిన్ని సీట్లు వచ్చేలా పనిచేస్తామని వెల్లడించారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందుడుగు వేస్తామని ఆయన  చెప్పారు.

అరికెపూడి టెక్నికల్‌గా బీఆర్‌ఎస్ సభ్యుడే

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ టెక్నికల్‌గా బీఆర్‌ఎస్ పార్టీ సభ్యుడేనని, అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారమే ఆయనకు పీఏసీ చైర్మన్ అయ్యారని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే  న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. పార్టీ మార్పులపై రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని, ఉప ఎన్నికలంటూ ఉవ్విళ్లూరుతున్న కేటీఆర్‌కు నిరాశే మిగులుతుందని చెప్పారు. కేటీఆర్ సవాళ్లను పట్టించుకునే స్థితిలో ఎవరూ లేరని ఆయన అన్నారు.

 పార్టీలోకి మరి కొంతమంది.. 

 మరి కొంతమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహేశ్ వెల్లడించారు. కాంగ్రెస్ విధానాలను, ప్రభుత్వ పాలన చూసి కొందరు నేతలు వస్తే పార్టీలోకి చేర్చుకున్నామని చెప్పారు. ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకనే నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే దాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించే స్థితిలో ఆ పార్టీ నేతలు లేరని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని, ఒకవేళ వచ్చినా ఆ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే చేరుతాయని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో  బీఆర్‌ఎస్‌కు సున్నా స్థానాలు ఇచ్చారని గుర్తు చేశారు.