calender_icon.png 28 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ.. మూటల కథ

28-10-2024 02:08:56 AM

  1. రియల్ వ్యాపారం కోసమే మూసీ పునరుజ్జీవం
  2. మూసీ పేరు చెప్పి కాంగ్రెస్ దోచుకుంటోంది
  3. మూసీకి కాదు.. లూటిఫికేషన్‌కే వ్యతిరేకం
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఢిల్లీకి మూటలు పంపేందుకే మూసీ మాటున కాంగ్రెస్ నేతలు మూ టలు వెనుకేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆదివారం నాచారంలోని మురుగు శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీని) స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం కోసమే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపడుతున్నారని, మూసీ పేరు చెప్పి కాంగ్రెస్ దోచుకుంటోందని విమర్శించారు. రుణమాఫీ, రైతుబం ధుకు డబ్బులు లేవు కానీ మూసీ పునరుజ్జీవానికి ఉన్నాయా? అని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, లూటిఫికేషన్‌కే వ్యతిరేకమని తెలిపా రు.

మూసీ అభివృద్ధి పేరిట ఇండ్లు కోల్పోతున్న వారికి అండగా నిలుస్తామని, రాజ్యాం గపరంగా, న్యాయపరంగా కొట్లాడుతామని చెప్పారు. ఇప్పటికే దాదాపు 500 మందికి ఊరటనిచ్చేలా హైకోర్టులో స్టే ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్, అంచనాలు లేనపుడు పేదల ఇండ్లను ఎందుకు కూల్చుతారని ప్రశ్నించారు.

ఇండ్లు ఖాళీ చేయాలనే అధికారులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. పేదల ఇండ్లను కూల్చితే బీఆర్‌ఎస్ సహించబోదని హెచ్చరించారు. పదేండ్లు ప్రణాళికాబద్ధంగా ఒక్కో రంగాన్ని సరిదిద్దుకుంటూ వచ్చామని చెప్పారు. ఇంటింటికి నీళ్లిచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణను మార్చామని అన్నారు.

హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడానికి తమ ప్రభుత్వం హయాంలో ఎంతో కృషి చేశామని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోనే మూసీ పునరుజ్జీవం పనులు చేపట్టామని తెలిపారు. మురుగును వందశాతం శుద్ధి చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నామని, రూ.20 వేల కోట్లతో మూసీపై 14 బ్రిడ్జిలు కట్టాలని ప్రణాళికలు రచించామని వెల్లడించారు.

ఇప్పుడు రేవంత్‌ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లతో సుందరీకరణ అంటున్నదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేవరకు పోరాడుతామని, ప్రజా సమస్యల పరిష్కారంలో తమ  ఎమ్మెల్యేలు ముందుంటారని తెలిపారు. అనంతరం ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చెక్కులను అందించారు.

కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూ ద్‌అలీ, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానంద్, ముఠాగోపాల్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యే శంభీపూర్‌రాజు, నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.